అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఏర్పడిన పరిస్థితులను బట్టి కొన్ని చోట్ల సీట్లు, అభ్యర్థులను మార్పు చేసేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రఘురామకు సీటు కేటాయించడం ఖాయమయింది. అందు కోసం ఏదో ఓ చోట మార్చాల్సి వస్తోంది. ఏలూరు సీటు బీజేపీకి ఇచ్చి.. నర్సాపురంను టీడీపీకి ఇచ్చే విషయంపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇక రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని స్థానాలపై కసరత్తు ప్రారంభమయింది.
ఆనపర్తి నియోజకవర్గంలో బీజేపీ అత్యంత బలహీనమైన అభ్యర్థి. ఆయన ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సీటులో టీడీపీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పట్టుదలకు పోయి ఓడిపోవడం కన్నా.. టీడీపీ నుంచి రామకృష్ణారెడ్డి పోటీ చేయడమే మంచిదన్న వాదన వినిపిస్తోంది. ఆయన బీజేపీ నుంచి పోటీ చేయమన్న ప్రతిపాదన వచ్చినా.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించలేదని చెబుతున్నారు.
అనకాపల్లి జిల్లా ఎంపీ స్థానం పరిధిలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు కోసం సీఎం రమేష్ పట్టుబడుతున్నారు. యలమంచిలి, మాడుగుల స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చాలని కోరుతున్నారు. మాడుగులలో టీడీపీ అభ్యర్థి పైలా ప్రసాద్ గట్టిగా ప్రయత్నించలేకపోతున్నారని ఆయన స్థానంలో బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలన్న ప్రతిపాదన సీఎం రమేష్ పెట్టారు. అదే సమయంలో యలమంచిలిలో జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్ స్పీడ్ అందుకోలేకపోతున్నారని.. ఆయనకు బదులుగా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రతిపాదన కూడా రమేష్ పెట్టారు. వీటిపై ఒకటి, రెండు రోజుల్లోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.