ఏపీలో రాజకీయం ఓ రూపానికి వస్తోంది. ఎన్డీఏ కూటమి నేతలంతా రాష్ట్రం మొత్తం తిరిగి విస్తృతంగా ప్రచారం చేస్తూంటే వైసీపీ మాత్రం టీవీల్లో గ్రాఫిక్స్ ను నమ్ముకుంటోంది. బస్సు యాత్ర పేరుతో ఏసీ బస్సులో కూర్చుని ప్రయాణిస్తున్న జగన్ కు జన నీరాజనం అంటూ టీవీల్లో గ్రాఫిక్స్ లు వేస్తున్నారు. కానీ పట్టుమని నాలుగైదు వేల మంది కూడా సభలకు రావడం లేదని ఆ పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డికి గాయమయ్యాక.. జనం వెల్లువెత్తారని టీవీల్లో చూపించారు. వాస్తవ పరిస్థితి మాత్రం.. ఇదేంటి కొడాలి నాని అని.. సజ్జల రామకృష్ణారెడ్డి భగ్గుమన్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ యాక్టివిటీ నీలి, కూలి మీడియాల్లోనే కనిపిస్తోంది. ఇంకెక్కడా కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో అసల్లేదు. కానీ ఎన్డీఏ కూటమి నేతలు మాత్రం మూడు వైపులా విస్తృతంగా పర్యటిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ రాయలసీమలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర అన్ స్టాపబుల్ అన్నట్లుగా నిర్వహిస్తున్నారు. ఆయన సభలకు జనం పోటెత్తుతున్నారు. జగన్ సభల కంటే బాలకృష్ణ సభలకే ఎక్కువ జనం వస్తున్నారు. ఇక చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోజుకు.. రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. వారానికి రెండు రోజులు కలిసి ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ప్రజాగళం సభలు.. జనసేన వారాహి విజయ యాత్ర సభలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం ప్రజల్లోకి వెళ్తోంది.
ఇక వైసీపీ అభ్యర్థులు కూడా చాలా చోట్ల ఖర్చు ఎందుకని.. ప్రచారంలో జోరు తగ్గించారు. ఇప్పటికే నెల రోజుల వరకూ.. గుంటూరు వంటి చోట్ల యాభై కోట్లకుపైగా ఖర్చు పెట్టుకున్న అభ్యర్ధులు రాను రాను పరిస్థితి తేడాగా మారుతూండటంతో జాగ్రత్త పడుతున్నారు. ఇతర పార్టీల నేతలకు భారీగా ఆఫర్లు చేసి పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తూండటంతో తమకూ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇవ్వకపోతే పార్టీకి పని చేయడం లేదు. ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు.
గురువారం నుంచి నామిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జగన్ ఇంకా బస్సుయాత్రలోనే ఉన్నారు. పరిస్థితి చూస్తూంటే.. మరో పది రోజులు బస్సు యాత్రలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యలో పులివెందులో నామినేషన్ కు వెళ్లాల్సి ఉంది. రోజు మార్చి రోజు సెలవు తీసుకునే అలవాటు జగన్ కు ఉంది. నిరంతరాయంగా ప్రచారం చేయరు. పూర్తిగా.. నీలి, కూలి మీడియాలో గ్రాఫిక్సే తమ ప్రచారం అని సరి పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.