రాజ్యసభలో ఎన్డీఏకు సాధారణ మెజార్టీ వచ్చింది. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో ఎన్డీఏకు 119 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో స్వయంగా బీజేపీకి 96 మంది ఉన్నారు. మిగతా వారు మిత్రపక్షాలకు చెందిన వారు. రాజ్యసభలో ఏదైనా బిల్లులు ప్రవేశ పెడితే నెగ్గడానికి అవసరమైన సాధారణ మెజార్టీ 117. అంటే కావాల్సిన దాని కన్నా రెండు సీట్లు ఎక్కువే ఉన్నట్లుగా లెక్కన్నమాట.
ఇటీవల జరిగిన ఉపఎన్నికలు, నామినేటెడ్ సభ్యులతో ఈ లెక్క తేలింది. త్వరలో మరికొన్ని సీట్లు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఒడిషాలో బీజేడీ రాజ్యసభ సభ్యులు రాజీనామా బాట పడుతున్నారు. వారు చేసే రాజీనామాలన్నీ బీజేపీ లేదా కూటమి పార్టీల ఖాతాల్లోకే చేరుతాయి. ఇది ఓ పది మంది వరకూ రాజీనామా చేయవచ్చని అంటున్నారు. అంటే.. బీజేపీ మిత్రపక్షాలు రాజ్యసభలో సంపూర్ణ మైన మెజార్టీని సాధించినట్లే.
ఇప్పటి వరకూ తమకు రాజ్యసభలో ఉన్న బలాన్ని చూపించి.. వైసీపీ లాంటి పార్టీలు కొన్ని సొంత ప్రయోజనాలను పొందాయి. ఇప్పుడు బీజేపీకి అలాంటి అవసరం లేదు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పవర్ గేమ్స్ ఆడితే అధికారం పోయిన తర్వాత అలాంటిగేమ్స్ రివర్స్ అవుతాయి. రాజ్యసభ సభ్యుల విషయంలో వైసీపీది అదే పరిస్థితి.