ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాలుగేళ్ల పాలనపై… అందరూ రకరకాలుగా విశ్లేషించారు. నిజానికి కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ ఎన్డీఏ పరిస్థితి నాలుగేళ్ల తర్వాత ఎలా ఉందన్నదానిపై మాత్రం ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా.. అదీ కూడా బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో ఏకమవుతున్న వైనంతో.. ఎన్డీఏ పరిస్థితేమిటన్నదానిపై చర్చ ప్రారంభమయింది. 2104లో నరేంద్రమోదీ క్రేజ్ దేశాన్ని ఊపేసింది కాబట్టి… పూర్తి మెజార్టీ బీజేపీకి వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కూటమిగా తప్ప… సొంతంగా అధికారం చేపట్టే పరిస్థితి అటు బీజేపీ కానీ..ఇటు కాంగ్రెస్‌కు కానీ లేదు. అంటే… జాతీయ పార్టీలకు..కచ్చితంగా ఇతర పార్టీల మద్దతు ఉండాల్సిందే.
ఈ విషయంలోనూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. నాలుగేళ్లలో ఘోరంగా విఫలమయ్యారు. చెప్పుకోవడానికి ఎన్డీఏలో చాలా పార్టీలుంటాయి. కానీ రెండు అంకెల సీట్లు ఉన్న పార్టీలు మాత్రం నిన్నామొన్నటి వరకు రెండే రెండు. అందులో ఒకటి శివసేన, రెండు తెలుగుదేశం పార్టీ. మిగతా వన్నీ..ఒకటి రెండు సీట్లకు పరిమితయ్యే పార్టీలే. తెలుగుదేశం పార్టీ కటిఫ్ చెప్పేసి… యుద్ధం ప్రకటించింది. మోదీని మళ్లీ ప్రధాని కానీయబోనని… చంద్రబాబు సవాల్ చేస్తున్నారు. ఇక శివసేన అయితే..మోదీ పేరు ఎత్తితేనే.. రగలిపోతోంది. ఇప్పటికే ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది.
ఎన్డీఏలో ఉన్న మిగతా పార్టీలు బీజేపీతో లాయల్‌గా ఉంటాయా..అంటే.. అసలు అలా బీజేపీనే ఉండదు.. ఇక ఆ పార్టీలు ఎందుకు ఉంటాయి…?. ప్రస్తుతం బీహార్‌లో ఆర్జేడీని తోసేసి అధికారం జేడీయూతో కలసి అధికారం పంచుకున్న బీజేపీకి… నితీష్ కుమార్ ఒక్కడే కాస్త పెద్ద మిత్రునిగా కనిపిస్తున్నారు. ఆయన కూడా… పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీని వదిలించుకుంటారనే ప్రచారం జరుగుతోంది. నితీష్ తో బీజేపీ జట్టుకట్టడంతోనే రామ్ విలాస్ పాశ్వాన్.. మళ్లీ కాంగ్రెస్, ఆర్జేడీ వైపు చూస్తున్నారన్న అంచనాలున్నాయి. తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏకు గుడ్ బై చెప్పడం.. జాతీయ రాజకీయాల్లో పెనుమార్పలకు కారణం అయింది. రెండు నెలలు తక్కువగా నాలుగేళ్ల పాటు ఒడిదుడుకులు లేకుండా సాగిన ఎన్డీఏ పయనం..ఇప్పుడు అస్థిత్వ ప్రమాదంలో పడింది.