లోక్ సభ స్పీకర్ పదవి కోసం మొదటిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. స్పీకర్ – డిప్యూటీ స్పీకర్ విషయంలో అధికార – ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇండియా కూటమి తరఫున స్పీకర్ పదవికి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్ దాఖలు చేయడంతో స్పీకర్ పదవి కోసం ఎన్నిక అనివార్యమైంది.
స్పీకర్ ఎన్నికల్లో అధికార పక్షానికి సహకరిస్తారని ఇండియా కూటమి స్పష్టం చేసింది. అయితే, సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇవ్వాలని.. రాజ్ నాథ్ సింగ్ తో చర్చించినా ఎలాంటి సానుకూల ప్రకటన రాకపోవడంతోనే స్పీకర్ ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
ఎన్డీయే తరఫున స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఓం బిర్లా రాజస్థాన్ లోని కోటా నుంచి మూడోసారి గెలుపొందారు. 2019లో ఆయన తొలిసారిగా స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఈసారి ఏపీకి చెందిన నేతకు స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా చివరికి ఓం బిర్లానే మరోసారి స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది.
ఇక, ఇండియా కూటమి నుంచి స్పీకర్ పదవికి పోటీ చేస్తోన్న సురేష్.. కేరళలోని మావెళికార నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన ఎనిమిదిసార్లు ఎంపీగా గెలుపొందారు. ఆయనకు ఉన్న అనుభవం దృష్ట్యా సురేష్ ను స్పీకర్ పదవికి ఎంపిక చేసింది కాంగ్రెస్. దీంతో స్పీకర్ పదవి కోసం తొలిసారి ఎన్నికలు జరుగుతుండటంతో పార్లమెంట్లో ఎన్డీయేకు మొదటి పరీక్ష ఎదురుకాబోతోంది.