బీఆరెస్ కు బలమైన కౌంటర్ ఇచ్చేందుకు అవకాశాలు వస్తున్నా సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ కాంగ్రెస్ ఫెయిల్ అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూపించిన దూకుడు అధికారంలోకి వచ్చాక కంటిన్యూ చేయడం లేదు. ఈ ఏడాదిన్నర కాలంలోనే కాంగ్రెస్ భారీగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని బీఆర్ఎస్ తెగ ప్రచారం చేస్తోంది. అందుకు కాంగ్రెస్ కూడా సరైన కౌంటర్లు ఇవ్వడం లేదు. సోషల్ మీడియా వాపును బలంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న బీఆర్ఎస్ అదే నిజమని నమ్మించడంలో సక్సెస్ అవుతోంది.
బీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ కు మరోసారి అద్భుతమైన ఛాన్స్ లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అంటూ ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్… ఆ నిరూపణకు బలం చేకూర్చేలా NDSA రిపోర్ట్ ఉన్నప్పటికీ దాన్ని జనం మధ్య చర్చలో నిలపడంలో విఫలం అవుతున్నట్టు కనిపిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సిలు , కార్పోరేషన్ చైర్మన్ లు మూకుమ్మడిగా కాళేశ్వరం నిర్వాకాన్ని చెప్పాల్సిన సమయంలో పెదాలు మూసుకొని కూర్చొన్నారు.
కాళేశ్వరంను నిర్లక్ష్యం చేయడంతోనే కాలువలకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు అంటూ బీఆర్ఎస్ ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రచారం చేస్తోంది. అసలు మేడిగడ్డలో వాటర్ స్టోరేజ్ ను ఎందుకు నిలిపివేశారో, అందుకు బీఆర్ఎస్సే కారణమని చెప్పేందుకు కాంగ్రెస్ కు బలమైన ఆయుధం NDSA రిపోర్ట్. ఇది బయటకు వచ్చినా దీన్ని వివరించడంలో కాంగ్రెస్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది.