కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మరమ్మత్తులపై గైడ్ లైన్స్ ను డ్యాం సేఫ్టీ అధికారులు జారీ చేశారు.
అయితే, ప్రాజెక్టులో దెబ్బతిన్న పిల్లర్లకు మాత్రమే కాకుండా మిగిలిన వాటికీ ప్రమాదం లేదనుకోలేమని స్పష్టం చేశారు. మొత్తం 85గేట్లలో 77 గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని మిగిలిన ఎనిమిది గేట్లలో మాత్రం సాంకేతిక , మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని , వీటిని చక్కదిద్దేందుకు ఏ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలో అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ రిపేర్ లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టెక్నికల్ పద్దతిన మరమ్మత్తులు చేపట్టాలన్నారు.
మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో 15నుంచి 22 పిల్లర్లు దెబ్బతినడంతో వాటిని రిపేర్ చేసేందుకుగాను గేట్లను పైకి ఎత్తివేయాలని , 20, 21 నెంబర్ గేట్లను ఓపెన్ చేయడానికి వీలు లేనందున వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే, 8 గేట్ల ప్రాంతంలో బ్యారేజీ మీదనున్న శ్లాబ్ కుంగిపోవడంతో కొత్త శ్లాబ్ వేయాలని పేర్కొన్నారు.
బ్యారేజ్ ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి దఫా వరదతో మేడిగడ్డలోని ఏడో బ్లాక్ లో సమస్యలు తలెత్తాయని వాటిని అప్పుడే గుర్తించి మరమ్మత్తులు చేపట్టి ఉంటే… మిగతా పిల్లర్లకు ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అధికారులు పేర్కొన్నారు. నిర్లక్ష్యం వలన ఇప్పుడు మిగతా పిల్లర్ల పటిష్టత విషయంలో సమస్యలు తలెత్తవనుకోలేమని స్పష్టం చేశారు. మరమ్మత్తుల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.