ప్రస్తుత సెలబ్రిటీల్లో రాంగోపాల్‌వర్మ అంతటి నాన్ సీరియస్ మనిషి మరొకరు ఉండరు. ‘తను చేయబోయే సినిమాను ప్రమోట్ చేసుకోవడం’ అనే పాయింటు తప్ప ఆయన జీవితానికి మరో పరమార్థం ఉండదు! సినిమా మేకింగ్ పట్ల విపరీతమైన జ్ఞానం ఎక్కువైపోయి… తన జ్ఞానం ఈ ప్రేక్షకులకు అనవసరం అని చులకన భావం ఏర్పడిపోయి.. అడ్డగోలుగా సినిమాలు చుట్టేస్తూ.. ప్రతి సినిమాకు ఒక వెరైటీ ప్రచార టెక్నిక్కును ఎంచుకునే రాంగోపాల్ వర్మ.. దర్శకుడు అనే టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి.. మొదటిరోజు టికెట్లు అమ్మిపెట్టడానికి స్ట్రాటజీ రచించే.. మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా, సేల్స్‌మ్యాన్‌గా మారిపోయి చాలా కాలమే అయింది. కొన్ని వారాలు నెలల తరబడి ఆయన ఎన్ని ప్రచార టెక్నిక్కులు ప్రయోగించినా.. ఆయన చేసే అడ్డగోలు సినిమాలు.. ఓపెనింగ్ టికెట్లు కాసిని అమ్ముడవుతున్నాయే తప్ప ఆ తర్వాత నిలబడ్డం లేదు. కొన్నయితే.. థియేటర్ల మొహం చూడకుండా మగ్గిపోతున్నాయి కూడా! ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్ని పరాభవాలు వరుసగా ఎదురవుతున్నా తన మేకింగ్ దర్శకత్వ ప్రావీణ్యం గురించి అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి గనుక.. ఏమాత్రం సిగ్గుపడకుండా ఆయన సినిమాలు చేస్తూనే ఉంటారు. ఏ చిత్రానికి ఎలాంటి వివాదాన్ని రేకెత్తిస్తే.. కాసిని టికెట్లు అమ్ముడవుతాయో ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా ‘వంగవీటి’ అనే చిత్రం టికెట్ల ‘సేల్స్‌మ్యాన్’గా (సేల్స్ స్ట్రాటెజీమ్యాన్గా) ఆయన విజయవాడ పర్యటనలో ఉన్నారు.
ప్రస్తుతం రాజకీయ నాయకులంతా.. పార్టీ రహితంగా పోలోమని కాపులను ఎట్రాక్ట్ చేయడానికి వెంపర్లాడిపోతూ ఉంటే.. వర్మ కూడా అదే బాట తొక్కారు. మొన్న తుని ఘటన, తర్వాత ఉద్యమాల రూపేణా కాపుల్లో ప్రస్తుతం ఉన్న ఫైర్‌ను క్యాష్ చేసుకుంటే.. రెండో రోజు కూడా టికెట్లు అమ్మడం సాధ్యమే అని ఈ మార్కెటింగ్ కన్సల్టెంట్‌కు బోధపడినట్లుంది. అందుకే వంగవీటి చిత్రాన్ని వీలైనంత వివాదాస్పద చిత్రం అనే కలర్ ఇవ్వడానికి పాట్లు పడుతున్నారు. పనిలో పనిగా.. ముద్రగడ పార్టీ పెడితే అందులో తాను చేరుతానంటూ.. ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చి రచ్చకెక్కారు.
కానీ ఇక్కడ తమాషా ఏంటంటే.. వర్మ అభిమానానికి ముద్రగడ కూడా బుట్టలో పడిపోవడం. పాపం తన జీవితానికి కాపుల అభ్యున్నతి, కాపుల సంక్షేమం అనే అంశాలు తప్ప మరో ఎజెండా అంటూ తెలియని మోస్ట్ సీరియస్, కమిటెడ్ రాజకీయవేత్త అయిన ముద్రగడ పద్మనాభం.. వర్మ ప్రయోగించిన మాయలో పడిపోయి.. నామీద ఆయనకున్న అభిమానానికి థాంక్స్ అనేశారు. వర్మ తన పేరును మార్కెటింగ్ ఎలిమెంట్‌గా వాడుకుంటున్నారనే సంగతిని ముద్రగడ గుర్తించలేకపోయారు.
ఆయన కొంచెం జాగ్రత్తగా గమనిస్తే.. వర్మ ఎలాంటి కామెంట్లు చేసినా.. అవతలి వాళ్లు వాటిని పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఆయన మాటలకు స్పందించిన వాళ్లు ఇటీవలి కాలంలో చాలా తక్కువ. కానీ.. ఈ తరహా వర్మ పైత్యం గురించి పాపం.. ముద్రగడకు అంతగా క్లారిటీ లేదేమో గానీ.. ఆయన తానుగా స్పందించి పప్పులో కాలేశారని ఫిలింనగర్లో జనం గుసగుసలాడుకుంటున్నారు.