‘కల్కి’ తరవాత రాజశేఖర్ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. మధ్యలో కొన్ని ప్రాజెక్టులు వచ్చినా, అవి దారి మళ్లిపోయాయి. ఇప్పుడు నీలకంఠతో ఓ కథని ఫిక్స్ చేసుకున్నాడు రాజశేఖర్. ఇది `జోసెఫ్` అనే మలయాళ చిత్రానికి రీమేక్ అని తెలుస్తోంది. 2018లో విడుదలైన `జోసెఫ్` మలయాళంలో మంచి విజయాన్ని అందుకుంది. ఇదో ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించారు. షాహి కబీర్ అనే రచయిత రాసుకున్న కథ ఇది. తన జీవితంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల్ని కథగా రాసుకున్నాడు. దాన్ని తెరపైకి తీసుకొచ్చిన పద్ధతి.. అక్కడి ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ కథని నీలకంఠ అయితే బాగా డీల్ చేస్తాడని రాజశేఖర్ కి అనిపించడంతో ఈ ప్రాజెక్టుని ఆయన చేతిలో పెట్టారు. నిజానికి మరో కథతో రాజశేఖర్ ని అప్రోచ్ అయ్యాడు నీలకంఠ. అప్పటికే `జోసెఫ్` సినిమాపై రాజశేఖర్ దృష్టి ఉండడంతో ఆ ప్రాజెక్టు నీలకంఠ చేతికి వచ్చింది.