ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కడా కంగారు పడటం లేదు. నింపాదిగా.. తాను చేయాలనుకున్నది చేస్తున్నారు. ప్రభుత్వం కోర్టు ఉల్లంఘనకు పాల్పడుతోందని.. నిరూపించేలా ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. తాము కోర్టు తీర్పులను ఉల్లంఘించలేదని వాదించడానికి అవకాశం లేకుండా .. ప్రభుత్వానికి చేస్తున్నారు. తాజాగా సీఎస్ నీలం సహానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడమే. లేఖతో పాటు హైకోర్టు తీర్పు కాపీని లేఖకు జతచేశారు.
రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ, కమిషన్ విధి నిర్వహణలో.. ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని.. తీర్పులో ఎన్నికల కమిషన్ను ఆదేశించిందింది. ఇదే విషయాన్ని తన లేఖలో పేర్కొన్న ఎన్నికల కమిషనర్… ప్రభుత్వ సహకారం అందించడం లేదనే విషయాన్ని నేరుగా చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్.. చీఫ్ సెక్రటరీ నీలం సహాని తీరు వల్ల రద్దయింది. ఇప్పటికే ఆమెపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
కోర్టు తీర్పు కాపీలు ఎటాచ్ చేసి.. నిమ్మగడ్డ లేఖ రాసినా.. సీఎస్ స్పందించకపోవడం.. ఖచ్చితంగా కోర్టు ఉల్లంఘనే అవుతుంది. డిసెంబర్ 30వ తేదీన రిటైర్ కాబోతున్న నీలం సహాని మెడకే ఇది చుట్టుకునే అవకాశం ఉంది. కోర్టు తీర్పులు పట్టించుకోకుండా.. ఉల్లంఘనకు పాల్పడితే… రాజకీయ నేతలు ఎప్పుడూ బాధ్యులు కారు. ఆదేశాలను అమలు చేయాల్సింది అధికారులే కాబట్టి వారే బాధ్యులవుతారు. గతంలో సీఎస్తో పాటు పలువురు అధికారుల్ని హైకోర్టు పిలిపించింది కూడా. ఇప్పుడు .. రిటైర్మెంట్ ముందు.. సీఎస్ రాసిన లేఖలు … వాటిని నిమ్మగడ్డ కోర్టు ముందుంచుతున్న విధానం .. ఆమెను చిక్కుల్లో నెడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.