రెండు రోజుల క్రితం విడుదలైన కే జి ఎఫ్ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. క్రిటిక్స్ యావరేజ్ రేటింగ్ ఇచ్చినప్పటికీ కథా పరంగా పెద్దగా ఏమీ లేదు అన్న టాక్ ఉన్నప్పటికీ కే జి ఎఫ్ సినిమా రెండవ భాగం గా వచ్చిన ఈ సినిమా కి మొదటి భాగాన్ని అభిమానించిన ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే సోషల్ మీడియా కి చెందిన కొందరు- ఈ సినిమా తమకు వ్యక్తిగతంగా నచ్చినందువల్లో లేక తమ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరినందువల్లో ఈ సినిమాను మోయడానికి తెలుగు సినిమా ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు వివరాల్లోకి వెళితే …
తెలుగు సినిమా రచయితలు అర్జంటుగా సిగ్గుపడాలంటున్న “నీలి” ప్రబుద్దులు:
నీలి మీడియాకు సంబంధించిన కొందరు కే జి ఎఫ్ సినిమా ని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విపరీతంగా మోస్తున్నారు. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ వ్రాసిన కొన్ని డైలాగులు చాలా అద్భుతంగా ఉన్నాయని, కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే తెలుగు సినిమా రచయితలు ఇటువంటి డైలాగులు రాయలేకపోతున్నారని, వారంతా అర్జెంటుగా కే జి ఎఫ్ సినిమా చూసేసి ఇలాంటి డైలాగులు రాయలేక పోయినందుకు సిగ్గుపడాలని నీలి మీడియా ప్రబుద్ధులు సూక్తులు చెప్తున్నారు. వారి వాదనను సమర్థించుకోవడానికి గాను కేజిఎఫ్ సినిమా లోని నాలుగు డైలాగులు ఉటంకిస్తున్నారు. “ఇక్కడ తలలు మారుతాయి తప్ప కిరీటాలు కాదు “ అనే డైలాగ్ ని, “నెపోటిజం, నెపోటిజం, మెరిట్ ని రానివ్వరా “ అనే డైలాగ్, స్మగ్లర్ చేత బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఎందుకు ఆక్రమించుకున్నారో చెప్పించే ఇంకొక డైలాగ్, అమ్మ వస్తుంది అంటూ హీరోయిన్ ప్రెగ్నెన్సీ గురించి రివీల్ చేసే డైలాగ్ లను చూపిస్తూ , తెలుగు సినిమా రచయితలు అందరూ ఈ డైలాగులు చూసి ఇలాంటి డైలాగులు రాయలేనందుకు సిగ్గుపడాలని ఈ కుహనా మేధావులు సూక్తులు చెబుతున్నారు.
తెలుగు సినిమా ని కించపరిచే ఈ “అతి” వెనక కారణాలు ఏంటి ?
నిజానికి నీలి మీడియా ఎందుకనో రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాపై తీవ్ర స్థాయిలో విషం కక్కింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్ నుంచి తమ తాహతుకు మించి డబ్బులు డిమాండ్ చేయడంతో సినిమా యూనిట్ వీరిని పక్కన పెట్టిన కారణంగా ఈ నీలి మీడియా ప్రబుద్ధులు ఆర్.ఆర్ఆర్ సినిమాపై విషప్రచారం చేసిందన్న వ్యాఖ్యలు ఒకవైపు, రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన హీరోలు కలిసి నటించిన ఈ సినిమాను ఎలాగైనా డామేజ్ చేస్తే తమ సామాజిక వర్గానికి చెందిన పార్టీకి మేలు జరుగుతుందనే రాజకీయ కారణాలతో ఇలా చేసింది అన్న వ్యాఖ్యలు మరొకవైపు సోషల్ మీడియా తో పాటు ఫిల్మ్ సర్కిల్స్ లో కూడా వినిపించాయి. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ , నీలి మీడియా ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద తన కడుపు మంటను చల్లార్చడానికి ఉద్దేశపూర్వకంగానే కే జి ఎఫ్ సినిమా ను మోస్తోందని, తమ కడుపు మంటను చల్లార్చుకోవడం కోసం ఏకంగా తాము దేనిమీద ఆధారపడి బతుకుతున్నామో ఆ తెలుగు సినిమా మొత్తాన్ని కించపరచడానికి సైతం నిస్సిగ్గుగా ముందుకు వస్తుందనే అభిప్రాయాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి.
అనేక ఇతర భాషల సినిమాల డైలాగులను తలదన్నేలా ఉన్న తెలుగు డైలాగులు వీరి కళ్లకు కనిపించలేదా ?
ఇవాళ సినిమా అన్నది భాషల హద్దులు చెరిపేసింది. ప్రాంతీయ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. అలాగే తెలుగు సినిమా లోని అనేక డైలాగులు దేశ స్థాయి లో పాపులర్ అయ్యాయి.
పుష్ప సినిమాలోని “పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ “ అన్న డైలాగ్ ని కొంత అటూ ఇటూ మార్చి ఇటీవల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఒక సభలో చెప్పగా ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఆ డైలాగ్ కి చప్పట్లు మారుమోగాయి. ఇవి మన నీలి మీడియా కి కనిపించవు. ఇదే సినిమాలోని తగ్గేదే లే అన్న ఒక్క పదం దేశవ్యాప్తంగా పలు భాష ల ప్రేక్షకుల నోళ్ళలో నానింది. మొన్నీమధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో ” నేను మల్లి కోసం వస్తే తాను మట్టి కోసం వచ్చాడు” అన్న ఒక్క డైలాగ్ తో కథాసారం మొత్తం చెప్పిన తెలుగు రచయితల ప్రతిభ , తమ వ్యక్తిగత ప్రయోజనం మాత్రమే ముఖ్యమైన నీలి మీడియా ప్రబుద్ధులకి బహుశా కనిపించదు.
అదేవిధంగా అర్థవంతమైన డైలాగులు రాయడం లో తెలుగు రచయితలు చిన్న పెద్దా అన్న తేడా లేకుండా ఎప్పుడూ ముందుంటారు. ” గెలుపు ది ఏముందిరా మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, అదే ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం అంటే ఏమిటో నీకు పరిచయం అవుతుంది” అన్న డైలాగ్ పిల్లజమీందార్ అన్న ఒక చిన్న సినిమాలోది. ప్రస్థానం అన్న మరొక చిన్న సినిమాలో ని డైలాగులలో ఉన్న ఫిలాసఫికల్ డెప్త్ బహుశా ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమాలోని డైలాగులలోను ఉండకపోవచ్చు. “ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూడు అవసరం కోసం దారి తప్పిన పాత్రలే తప్ప హీరోలు విలన్లు ఉండరు ఈ నాటకంలో” అన్న డైలాగ్ కథానుగుణంగా ఎంతో అర్థవంతంగా అనిపిస్తుంది.
ఇక మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు అనేకం తెలుగోడి జీవితంలో భాగంగా మారిపోయాయి అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఆఫీసుల లో ” ఏంటి సెటైర్ వేస్తున్నావా” అని ఎవరైనా అడిగితే వెనువెంటనే ” భలేవారు సార్ మీతో సెటైర్ వేస్తే రిటైరయి పోతాను” అన్న సమాధానమే తప్పకుండా వస్తూ ఉంటుంది. ఇదే త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాలో పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం పెద్ద లెక్క కాదు అంటూ స్త్రీ సాధికారత గురించి చెప్పిన డైలాగ్, ఖలేజా క్లైమాక్స్ లో ” స్వామి ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం” అని చెప్పిన డైలాగ్ వంటివి ఎన్నో డైలాగులు తెలుగు సినీ రచయితల ప్రతిభకు అద్దం పట్టాయి. అయితే తమ వ్యక్తిగత కక్కుర్తి కోసం తెలుగు సినిమాను కించపరచడానికి సిద్ధపడ్డ ప్రబుద్ధుల కు బహుశా ఇవేవి కనిపించకపోవచ్చు.
పోనీ, హీరోయిజం ఎలివేట్ చేసే డైలాగులు మాత్రమే డైలాగులు అని వారు అనుకున్నా, కే జి ఎఫ్ కీ ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఎన్నో సంవత్సరాల క్రితమే తెలుగు రచయితలు డైలాగులు రాసి ఉన్నారు. పూరి జగన్నాథ్ పోకిరి , బిజినెస్ మాన్ సినిమా లో రాసిన డైలాగ్ లు చదువుకుంటూ పోతే ఒక పుస్తకం పబ్లిష్ చేయాల్సి వస్తుంది. అంత వరకూ ఎందుకు, కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం మాస్ ఎలివేషన్ ల కోసం , మాస్ సీన్ ల కోసం తాను తెలుగు సినిమాలను విపరీతంగా చూసేవాణ్ణి అని చెప్పడం గమనార్హం.
మరి ఈ లెక్కన చూస్తే కేజిఎఫ్ దర్శకుడు సైతం అనేక తెలుగు సినిమాల నుంచి స్ఫూర్తి పొందానని చెబుతుండగా నీలి మీడియా ప్రబుద్ధులు మాత్రం కేజిఎఫ్ డైలాగ్ ల ను చూసి తెలుగు సినీ రచయితలు , తెలుగు సినిమా అర్జెంట్‌గా సిగ్గుపడాలని చెప్పడం ఎంతవరకు సబబు అన్నది వారి విజ్ఞతకే వదిలేద్దాం ( విజ్ఞత అన్న పదానికి అర్థం వారికి తెలుసని భావిస్తూ) . కానీ నిజంగా సిగ్గు పడాల్సింది ఎవరైనా ఉన్నారు అంటే అది తెలుగు సినిమా రచయితలు కాదు కానీ, తల్లి పాలు తాగి రొమ్ములను గుద్దిన విధంగా – తెలుగు సినిమా మీద బతుకుతూ, ఆ తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగినప్పుడు దానిమీద విషం కక్కి, ఆ తెలుగు సినిమాను తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కించపరిచే ప్రబుద్ధులే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని సిగ్గుపడాలి.
– జురాన్ ( @CriticZuran)