నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకి వచ్చినపుడు ఆయనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా కేంద్రం నుండి ఆశించినంతగా నిధులు విడుదల కావడంలేదని ముఖ్యమంత్రి పనగారియాకు చెప్పారు. అయినప్పటికీ అతి కష్టం మీద రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలియజేసారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి విషయం ఏమయిందని చంద్రబాబు నాయుడు అరవింద్ పనగారియాను అడిగినప్పుడు, తాము దానిపై నివేదిక తయారు చేసి ప్రధాని నరేంద్ర మోడికి ఇచ్చేమని ఆయన తెలిపారు. ఇప్పుడు ప్రధాని మోడీయే దానిపై తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది కనుక త్వరలోనే తను డిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం రూ.2.25లక్షల కోట్ల ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. మరి నీతి ఆయోగ్ తన నివేదికలో ఎంత ఇవ్వవచ్చని సూచించిందో తెలియదు. కానీ ఆర్ధిక ప్యాకేజి కోసం నివేదిక సిద్దం చేసి ప్రధాని నరేంద్ర మోడికి ఇచ్చినట్లు తెలిసింది కనుక బహుశః కొత్త సంవత్సరంలో ప్రకటిస్తారేమో చూడాలి.