ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పేషిలో అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పనుల మీద వచ్చిన వాళ్లను సాయంత్రం మంత్రిగారి ఇంటి దగ్గరకు వచ్చేయమంటున్నారని అక్కడ పనులు చక్కబెట్టుకుంటున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం టీడీపీలోనూ కలకలం రేపుతోంది. మంత్రి అచ్చెన్నాయుడు ఇలాంటివి పట్టించుకోకపోవడం వల్ల ఆయనకే ఇవన్నీ చుట్టుకుంటున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
వ్యవసాయ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత అచ్చెన్నాయుడు తన టీమ్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో చక్రం తిప్పిన అధికారులే ఇప్పటికీ కొనసాగుతున్నారు. వారి అండతోనే మంత్రి పరిపాలన చేస్తున్నారు. ఆయన తన శాఖను నడపడానికి … తనకు నచ్చిన అధికారుల్ని నియమించుకోవడంలో విఫలం కావడంతో అక్కడ పాతుకుపోయిన వారు తమ దందాలను పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఈ క్రమంలోనే వసూళ్ల ఆరోపణలు వస్తున్నాయి.
అచ్చెన్నాయుడు తన శాఖ విషయాలతో పాటు తన చుట్టూ ఉన్న వారిపైనా కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అచ్చెన్నాయుడుపై ఇలాంటి ప్రచారం జరగడం ఇదే మొదటి సారి. రాజకీయాలు అన్నాక ఎన్నో ఆరోపణలు వస్తూంటాయి. వాటిని ఎప్పటికప్పుడు నియంత్రించుకునే మార్గం పెట్టుకోవాలని.. వాటిని నిర్లక్ష్యం చేస్తే బలంగా ప్రజల్లోకి వెళ్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.