మేడిన్ ఇండియా వస్తువులు అంటే పనికి మాలినవని… పై స్థాయి వాళ్లే.. వ్యాపార ప్రయోజనాల కోసం ముద్ర వేస్తూంటే.. ఇక సామాన్య ప్రజలు మాత్రం.. విదేశీ మోజు ఎలా వదులుకుంటారు..?. కరోనా వ్యాక్సిన్ టీకా విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ప్రపంచంలో 120కిపైగా దేశాలకు వివిధ రకాల టీకాలు ఎగుమతి చేస్తూ.. బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగిన భారత్ బయోటెక్ ను.. భారతీయులే నమ్మకుండా చేసేందుకు బడా కుట్రను చేసేశారు. ఆక్స్ఫర్డ్ – అస్ట్రాజెనెకా అనే యూకే సంస్థలు కలిసి తయారు చేసిన టీకాను ఇండియాలో అమ్ముకునేందుకు సీరమ్ సంస్థ… ఓనర్లు ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. నిన్నామొన్నటి వరకూ ఎవరికీ తెలియని.. ఎలాంటి గొప్ప బ్యాక్ గ్రౌండ్ లేని సీరమ్… ఆక్స్ ఫర్డ్ టీకాను… ఇండియాలో మార్కెట్ చేసుకునేందుకు హక్కులు పొంది.. అదే తమ ఘనతగా చెలరేగిపోతోంది. రాత్రికి రాత్రి కుబేరులైపోదామని… భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకాపై బురద చల్లడం ప్రారంభించింది. అది నీటితో సమానమని చెప్పడం ప్రారంభించింది.
నిజానికి ఆక్స్ ఫర్డ్ టీకాలు ప్రయోగదశలో ఎన్నో సైడ్ ఎఫెక్టులు బయటపడ్డాయి. వాటిపై తర్వాత ఏం చేశారో స్పష్టత లేదు. కానీ.. వాటికి అత్యవసర అనుమతిని కేంద్రం ఇచ్చేసింది. ఒక రోజు తర్వాత భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన టీకాకు కూడా అత్యవసర అనుమతి లభించింది. వెంటనే .. ఆక్స్ ఫర్డ్ టీకాను ఇండియాలో అమ్ముకుంటున్న సీరమ్ సంస్థ.. తమకు పోటీ వచ్చిందని తెగ కంగారు పడిపోయింది. పైగా కేంద్రం… మేడిన్ ఇండియా టీకాలే భారత్ కు సప్లయ్ చేస్తామని… ఆత్మ నిర్భర్ టీకా అని గొప్పగా చెబుతూండటంతో… తమకు టీకాల పేరుతో ప్రజల్ని దోచుకునే అవకాశం పోతుందని… ఆందోళన చెందినట్లుగా ఉంది. అందుకే.. తమ కంపెనీ … ఫైజర్ లాంటి విదేశీ కంపెనీలు రూపొందించిన టీకాలు తప్ప.. మిగిలిన వ్యాక్సిన్లన్నీ.. నీళ్లతో సమానమని సీరమ్ సంస్థ ప్రచారం ప్రారంభించింది.
దీనిపై భారత్ బయోటెక్ తీవ్రంగా స్పందించింది. అసలు సీరమ్ సంస్థ వైద్య రంగంలో సాధించిన విజయాలేమిటో … భారత్ బయోటెక్ సాధించిన విజయాలేమిటో మీడియా ముందు పెట్టింది. తమ ట్రయల్స్ డేటాను వెల్లడించింది. అదే సమయంలో.. ఆస్ట్రాజెనెకా- ఆక్స్ ఫర్డ్ ట్రయల్స్ డేటాలోని లోపాలనూ ఎత్తి చూపింది. నిజానికి ఇలా చేయకూడదు. కానీ. … వారి టీకాను ప్రమోట్ చేయడానికి.. తమ టీకాను నీళ్లతో పోల్చిన దాన్ని తిప్పి కొట్టడానికి భారత్ బయోటెక్ అలా చేయక తప్పలేదు. సీరమ్ సంస్థ.. టీకాల మార్కెటింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించడానికి సిద్ధమయిందని ఇప్పటికే అనేక ర కాల కథనాలు వచ్చాయి. ప్రభుత్వానికి రూ. రెండువందలకు ఇచ్చి.. ప్రజలకు రూ. వెయ్యి నుంచి రెండు వేలకు టీకా అమ్మడానికి రంగం సిద్ధం చేసుకుంది. భారత్ బయోటెక్ కూడా పోటీకి వస్తే తమ ఆదాయానికి గండి పడుతుందని ఆందోళన చెంది ఇప్పుడు.. స్వదేశీ టీకాపై దుష్ప్రచారం మొదలు పెట్టింది.
భారత్ బయోటెక్ టీకాను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది. తమ టీకా అతి తక్కువ ధరకు ఇస్తామని భారత్ బయోటెక్ చెబుతోంది. అది నీళ్ల బాటిల్ కంటే తక్కువ.. అంటే రూ. ఇరవైకే ఇస్తామని చెబుతోంది. అంత తక్కువకే టీకా వేస్తే.. వేలకు వేలు పెట్టి అమ్మి.. సొమ్ము చేసుకోవాలనే తమ ప్లాన్ తేడా కొట్టేస్తుందని..సీరమ్ సంస్థ యజమానాలు ఆందోళన చెంది.. వాటర్ ప్రచారం ప్రారంభించారు. ప్రపంచం మొత్తం ఇండియన్స్ .. ఇండియన్ కంపెనీలు పేరు తెచ్చుకున్నా… ఇలాంటి వారి వల్లే.. ఇండియాలో ఇండియన్ కంపెనీలు… క్వాలిటీ లేనివిగా నిలబడిపోతాయి. ప్రజల ఆలోచనా సామర్థ్యాన్ని తక్కువ చేసి.. ఇలాంటి కంపెనీలు… ఓ రకంగా దేశద్రోహానికే పాల్పడుతున్నాయి.