కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు అంత ఆతృతగా ఎదురు చూడటం లేదు. అదేదో కరోనా నుంచి కాపాడే వజ్రాయుధం అని ప్రజలు అనుకోవడం లేదు . దాని వల్ల కొత్త సమస్యలు వచ్చి పడతాయేమోనన్న ఆందోళన స్వయంగా వైద్య సిబ్బందిలో ఉంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు కోవిన్ యాప్‌లో రిజిస్టరైన అనేక మంది వైద్య సిబ్బంది ఆసక్తి చూపించలేదు. ఎక్కువ మంది వైద్యులు కూడా.. వెనుకడుగు వేసినట్లుగా చెబుతున్నారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులు.. ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్స్కు టీకా ఇస్తున్నారు. వారు మాత్రం.. అధికారులు చెప్పినట్లుగా టీకా వేయించుకున్నారు.
ఒకరిద్దరికి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా.. ప్రాథమిక చికిత్సతో కోలుకున్నారు. వ్యాక్సిన్‌పై రకరకాల నెగెటివ్ ప్రచారాలు జరగడమే.. కొంత మంది వైద్య సిబ్బంది వెనుకడుగు వేయడానికి కారణంగా భావిస్తున్నారు. ఈ తరహా ప్రచారం జరుగుతోందని ప్రధానమంత్రి నుంచి కింది స్థాయి వైద్యాధికారుల వరకూ.. ఎలాంటి భయమూ అక్కర్లేదన్న ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రకటనల వల్లనే మరింత ఎక్కువగా ఆందోళన పెరుగుతోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కరోనా పరిస్థితి అంత సీరియస్‌గా లేకపోవడం.. రెండు డోసులు తీసుకోవాలని.. జాగ్రత్తగా ఉండాలని అదే పనిగా సూచనలు చేస్తూండటంతో చాలా మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు.
ఇప్పుడు వైద్య సిబ్బందే వెనుకడుగు వేస్తున్నారు.. తర్వాత .. కరోనా వారియల్స్కు సామాన్యులకు ఇవ్వాల్సి ఉంటుంది. వారెవరూ ఆసక్తి చూపించకపోతే.. వ్యాక్సినేషన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. వ్యాక్సిన్‌పై నెగెటివ్ ప్రచారం జరగకుండా ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్న చర్చ నడుస్తోంది.