ఈ యేడాది విడుదలైన సూపర్ డూపర్ హిట్లలో జాతి రత్నాలు ఒకటి. 4 కోట్లతో తీసిన ఈ సినిమా.. ఏకంగా 40 కోట్లు సాధించేసింది. ఓ సినిమా హిట్టయ్యింది అని చెప్పడానికి ఇంత కంటే సాక్ష్యం ఏముంటుంది? ఈ సినిమా తరవాత.. హీరో నవీన్ పొలిశెట్టి తన పారితోషికాన్ని 5 కోట్లకు పెంచేసినట్టు టాక్. ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ అలాంటిది.
అయితే థియేటర్లలో మోసేసిన ఈ సినిమాని చూసి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులు… పెదవి విరుస్తున్నారు. అమేజాన్ లో రెండు రోజుల క్రితం `జాతి రత్నాలు` బొమ్మ పడింది. ఈ సినిమాని తొలి సారి ఓ టీ టీలో చూసిన ప్రేక్షకులు… `ఇదేం సినిమా, దీనికి ఇంత హైప్ ఇచ్చారేంటి?` అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు విసురుతున్నారు. `అసలేమాత్రం లాజిక్ లేని సినిమా. కామెడీ కూడా అంతంత మాత్రమే. దీన్ని ఎలా హిట్ చేశారు.. నవ్వుల కోసం అంత కరువు వాచిపోయి ఉన్నారా` అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీన్ని బట్టి.. థియేటర్ ఆడియన్స్ – ఓటీటీ ఆడియన్స్ ఇద్దరూ వేర్వేరన్న సంగతి అర్థమైపోతోంది. థియేటర్లో ఓ సినిమా చూస్తూ… ఎంజాయ్ చేయడం వేరు. ఇంట్లో ఒక్కరే ఓటీటీలో చూడడం వేరు. ముఖ్యంగా కామెడీ సినిమాలు మాస్ లో చూస్తే లెక్క, కిక్కూ వేరుగా ఉంటుంది. పైగా `జాతిరత్నాలు`కి మామూలు ప్రచారం దక్కలేదు. ఓటీటీలో తొలిసారి చూసే ప్రేక్షకులు అంచనాలు పెంచేసుకుని చూశారు. దాంతో…. తేడా కొట్టేస్తోంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే… ప్రేక్షకులు ఫ్లాప్ చేసేసేవారేమో..??