కరోనాకు ఆనందయ్య ముందును ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నించడం… ఇప్పటి వరకూ అనుమతి ఇవ్వకుండా… ఆ ఆనందయ్యను కనిపించకుండా చేయడంతో సోషల్ మీడియాల రకరకాల చర్చ జరుగుతోంది. ఆయన మందు మంచిదని… మెడికల్ మాఫియాకు తలొగ్గి..ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న ఆరోపణలు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి. అదే సమయంలో కొంత మంది రకరకాల చర్చలు ప్రారంభించారు. అందులో ఎక్కువ మంది వినిపిస్తున్న వాయిస్.. అసలు ఇంగ్లిష్ వైద్యానికి ఏంది ప్రామాణికత.. అని..!
ఇంగ్లిష్ మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా..? కరోనా వల్ల ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోవడం లేదా..? ఆస్పత్రుల్లో చేరితే అందరికీ నయమవుతుందా..? ఆనందయ్య మందుపై విచారణ జరిపుతున్న ప్రభుత్వం.. ఆస్పత్రులపై.. ఫార్మా కంపెనీలపై విచారణ చేయగలదా..? ఇలా.. విచిత్రమైన వాదనలతో… ఆస్పత్రులపై.. వైద్యంపై అపనమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో… వీరి వాదనకే ఎక్కువ మద్దతు లభిస్తోంది. ఆనందయ్య మందుకు కరోనా నయం అయిపోతోందని.. మెజార్టీ నమ్ముతున్నారు. దీనికి కారణం… వైరస్ను కంట్రోల్ చేసే మందును ఇంత వరకూ కనిపెట్టలేకపోవడమే కావొచ్చు. అంత మాత్రాన… అందుబాటులో ఉన్న వైద్య ప్రక్రియను వేస్ట్ అని తీసి పారేసి.. ఆ ప్రక్రియపై ఉన్న నమ్మకాన్ని కూల్చివేస్తే ఎవరికి ప్రయోజనం.
నిజంగా చెప్పుకోవాలంటే ఆనందయ్య మందు నిజంగా కరోనాను నయం చేస్తుందా లేదా అనేది పరిశోధన ద్వారానే చేయాలి. ఎవరు చేయాలి..?… దానికి తగ్గ అర్హత ఎవరికి ఉంది..?., సీటీ స్కాన్లు.. ఇతర టెస్టులు చేస్తే నమ్మే పరిస్థితి లేదు. ఆయుర్వేద వైద్యం అంటున్నారు కాబట్టి… ఆయుర్వేద నిపుణులే.. తేల్చాలి. వారే కరోనా ఉందో.. తగ్గిందో నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ అలాంటి నిపుణులు ఎక్కడ ఉన్నారు..? నిజానికి ఇంగ్లిష్ మందా.. ఆయుర్వేద మందా అన్నది ప్రామాణికం కాదు. ముందుగా… ఏ వైద్యుడి దగ్గరకు వెళ్తున్నారో .. ఆ వైద్యుడిపై రోగికి అంతులేని నమ్మకం ఉండాలి. అప్పుడే ఫలితాలొస్తాయి.
చాలా ఊళ్లలో వైద్యులకు మంచి చేయి అనే పేరు ఉంటుంది. ఆ పేరే వారికి బ్రాండ్. ఆయన చూస్తే తగ్గిపోతుందని నమ్ముతారు. అదే నమ్మకం., చాలా మంది ఆర్ఎంపీలకూ ఆ పేరు ఉంటుంది. ఆ నమ్మకమే సగం రోగాన్ని తగ్గిస్తుంది. కరోనా లాంటి భయం వైరస్ పట్టుకునే రోగానికి నమ్మకమే ముప్పావు వంతు వైద్యం. అనందయ్య వద్ద ఆ మందు ఉంది. అంత వరకూ ఓకే కానీ.. అందు కోసం… అసలు వైద్య ప్రక్రియపై అనుమానాలు రేపితే… నష్టపోయేది సమాజమే.