హిట్టు పడగానే పారితోషికం పెంచేస్తుంటారు హీరో, హీరోయిన్లు. ఇదేం తప్పు కాదు. కాకపోతే ఆ విషయాన్ని ఎవరూ ఒప్పుకోరు. ‘నేను పారితోషికం పెంచడమేంటి? ఎంతిస్తే అంత తీసుకొనే రకం’ అంటూ కాకమ్మ కబుర్లు చెబుతుంటారు. కానీ నేహా శెట్టి మాత్రం ‘ఔను.. నేను పారితోషికం పెంచా’ అని ధైర్యంగానే చెబుతోంది. `డీజే టిల్లు`తో నేహా శెట్టి జాతకమే మారిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం, అందులో రాధిక పాత్రకు మంచి పేరు రావడంతో నేహా అందరి దృష్టిలో పడింది. ‘టిల్లు స్క్వేర్’లో నేహా కనిపించింది కాసేపే. కానీ థియేటర్ మోత మోగిపోయింది. ఇదంతా నేహా క్రేజ్‌కి నిదర్శనం. దాన్ని నేహా కూడా క్యాష్ చేసుకొనే పనిలో పడింది. ‘టిల్లు’ తరవాత తన పారితోషికం ఒక్కసారిగా మూడు రెట్లు పెంచిందని సమాచారం. ఈ విషయాన్ని నేహా ఒప్పుకొంది కూడా.
”అవును.. పారితోషికం పెంచాను. పారితోషికం అనేది కష్టానికీ, గౌరవానికి ప్రతీక. కంపెనీలో ఓ ఉద్యోగి బాగా కష్టపడితే తనకు ప్రమోషన్ ఇస్తారు. దాంతో పాటు జీతం పెరుగుతుంది. కథానాయికలకూ అంతే. ఓ సినిమాలో బాగా కష్టపడి రాణిస్తే, తరువాతి సినిమాకు పారితోషికం పెరుగుతుంది. పారితోషికం పెరిగిందంటే మనపై నిర్మాతలకు నమ్మకం పెరిగినట్టే. కాబట్టి నేను రెమ్యునరేషన్ పెంచానన్న విషయం గర్వంగానే చెప్పుకొంటా” అంటోంది. తను కథానాయికగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఈనెల 31న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బుజ్జిగా తెరపై కనిపించనుంది నేహా.