మనల్ని ఎవరైనా మాటల్తో అవమానిస్తే మనం ఏం చేస్తాం..? స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇస్తాం. అదెలా ఉండాలి అంటే.. మరోసారి మనల్ని అవమానించడానికి నోరు రాని విధంగా ఆ షాక్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రనూ అందరూ అవమానిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల వాళ్లు.. తమ ప్రజల్ని మెప్పించడానికి… ఆంధ్రను ఉదాహరణగా చూపి అవమానిస్తున్నారు. కానీ ఎలాంటి ప్రతిస్పందన రావడం లేదు. ఫలితంగా ఇతరులు కూడా అదే పనిగా అవమానించడం ప్రారంభించారు. తెలంగాణ, తమిళనాడు ప్రముఖ నేతలే ఏపీ గురించి.. ఏపీ నేతల గురించి అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. మాటలు పడుతున్నవారు స్పందించడం లేదు.
ఏపీని తీసి పడేస్తున్న కేసీఆర్, హరీష్..!
ఆంధ్రప్రదేశ్‌ను తక్కువ చేసి చూపడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. గత ప్రభుత్వంలో ఆయన ఏమైనా అంటే.. గట్టిగా రివర్స్ ఎటాక్ ఇటు వైపు నుంచి వచ్చేది. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి రివర్స్ ఎటాక్‌లు వచ్చే అవకాశం లేకపోవడంతో తమ ప్రజల ముందు గొప్పగా చెప్పడానికి.. తమ పనితనాన్ని హైలెట్ చేసుకునేందుకు ఏపీని కించ పరుస్తున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే ఏపీలో భూముల విలువ దారుణంగా పడిపోయింది.. తెలంగాణ భూముల విలువ ఎక్కడికో పోయిందని ప్రకటించుకున్నారు. అంతకు ముందు ఓ సారి ఏపీ అధఃపాతాళానికి పడిపోయిందని తేల్చారు. తాజాగా… మంత్రి హరీష్ రావు కూడా అంత కంటే దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో యాసంగి సీజన్లో 22 లక్షల ఎకరాల వరి పంట మాత్రమే పండిస్తున్నారని.. తెలంగాణలో 53 లక్షల ఎకరాల్లో పంట వేశారని …ఆంధ్రోళ్లే ఒకప్పుడు… తెలంగాణ వారికి వ్యవసాయం రాదని ఎగతాళి చేశారని.. వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆంధ్రోళ్లకు వ్యవసాయం రాదన్నట్లుగా హరీష్ రావు పుల్లవిరుపు మాటలు మాట్లాడుతున్నారు. ఆంధ్ర తో పోలిస్తే తెలంగాణ లో మూడింతలు భూమి ధరలు పెరిగాయని.. ఆంధ్ర వెనుకబడిపోయిందన్నారు. ఇదంతా… ఏపీ వెనుకబడిపోయిందని… తాము ఎక్కడికో వెళ్లిపోయామని చెప్పుకునే తాపత్రయంలో భాగంగానే నడిచింది.
ఏపీ నేతల్లా ఉండబోమంటూ తమిళనాట సెటైర్లు.. !
మరో వైపు తమిళనాడులో ఎన్నికలు జరుగుతూంటే.. అక్కడి నేతలు కూడా… తాము ఏపీ నేతల్లాంటి వాళ్లంకాదని ఉదహరణలు చెబుతూ.. తమ హీరోయిజాన్ని ఎలివేట్ చేసుకుంటున్నారు. తమిళనాడు ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల ముందు స్టాలిన్ కుమార్తె ఇళ్లలో ఐటీ సోదాలు చేశారు. ఆ సందర్భంలో స్టాలిన్ చాలా గంభీరమైన ప్రకటన చేశారు. ఎన్నికల సభల్లో విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు దర్యాప్తు సంస్థలతో భయపెడితే భయపడబోమని… పొరుగు రాష్ట్రాల సీఎంల లాగా భయపడబోమని ఆయన ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏపీ , తెలంగాణసీఎంలు కేసుల భయంతో బీజేపీని పల్లెత్తు మాట అనరన్న ప్రచారం తమిళనాడులో బాగా జరిగింది. ఈ క్రమంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చివరికి కమల్ హాసన్ కూడా.. తన పార్టీని కార్యకర్తల్ని ఇతర జెండాలకు తాకట్టు పెట్టబోనని.. పవన్ కల్యాణ్‌ను ఉదాహరణగా చూపించి అన్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఏపీ ఆత్మగౌరవాన్ని పాలకులు కాపాడలేరా..?
ఎవరికైనా ఆత్మగౌరవం ముఖ్యం. కానీ ఆంధ్రలో ప్రస్తుతం అదే కరవైంది. అటు కేసీఆర్ కించ పర్చినా.. ఇటు స్టాలిన్ ఎగతాళి చేసినా ఎవరికీ స్పందనల్లేవు. ఒక్కరంటే ఒక్కరూ ఖండించలేదు. ఫలితంగా ఏపీ అంటే ఇంకా ఇంకా అలుసైపోతోంది. పొరుగురాష్ట్రాల ప్రజల ముందు ఏపీ కి కనీస గౌరవం దక్కడం గగనంగా మారింది. పాలకులు… ఇతర అంశాల్లో ఎలా ఉన్నా రాష్ట్ర గౌరవాన్ని బయట కాపాడటం అత్యంత కీలకం. అదీ కూడా చేయకుండా.. కుల, మత రాజకీయాలు చేసుకుంటే స్వయం వినాశనమే తప్ప… ప్రయోజనం ఉండదు.