ఈ వేసవిలో తెలుగు చిత్రసీమకు మంచి విజయాలే అందాయి. రంగస్థలం, భరత్ అనే నేను, సావిత్రి… ఇలా చెప్పుకోదగిన విజయాల్ని సాధించింది టాలీవుడ్. రంగస్థలం, భరత్.. వంద కోట్లు దాటాయి. సావిత్రి తెలుగు చిత్రసీమ కీర్తి పతాక రెపరెపలాడించింది. ఈ వేసవి సీజన్ ముగిసేలోగా మరో ఒకట్రెండు విజయాలు దక్కితే… బాగానే ఉంటుంది. ఈ సీజన్లో మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి కూడా. ఆఫీసర్, నేల టికెట్టు, అమ్మమ్మగారి ఇల్లు, నా నువ్వే… ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది. కాకపోతే… ఈ సినిమాలపై వినిపిస్తున్న టాకే కాస్త కంగారు పెడుతోంది. రవితేజ – కల్యాణ్ కృష్ణ సినిమాపై టాలీవుడ్ గురి పెట్టింది. కల్యాణ్ కృష్ణ ట్రాక్ బాగుంది. దాంతో పాటు నేల టికెట్టు అనే పేరు మాస్‌ని థియేటర్ల వైపుకు తీసుకొచ్చేలా ఉంది. రవితేజకు కూడా బాగా సూటయ్యేదే. కానీ ముందు నుంచీ ఈ సినిమాపై ఎలాంటి హైప్ లేదు. సెన్సార్ రిపోర్ట్ చూస్తే సోసోగా ఉంది. ఫస్టాఫ్ కామెడీ వర్కవుట్ అయ్యిందని, సెకండాఫ్‌లో ఎమోషన్లు సరిగా పండలేదని, క్లైమాక్స్ మరీ హెవీగా కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు.
‘ఛలో’ తరవాత… నాగశౌర్య నుంచి వస్తున్న సినిమా ‘అమ్మమ్మగారి ఇల్లు’. ఇదో ఫ్యామిలీ సబ్జెక్ట్ అనే సంగతి టైటిల్ చూస్తేనే అర్థమైపోతోంది. ఛలోతో యూత్‌ని ఆకట్టుకున్న నాగశౌర్య ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలని చూడడం మంచి ప్రయత్నమే. కాకపోతే.. ఈ సినిమాపై కూడా ఎలాంటి బజ్ లేదు. ఈ వారం విడుదల అవుతున్నా ప్రమోషన్ల పరంగా అలికిడి కనిపించడం లేదు. నేల టికెట్టుతో పోల్చి చూస్తే ప్రమోషన్లు డల్‌గా ఉన్న మాట వాస్తవం. సినిమా స్లో గా ఉందని, యూత్‌కి కనెక్ట్ అవ్వడం కష్టమన్నది టాక్. `ఆఫీసర్` పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వర్మ బ్రాండ్ ఎప్పుడో పడిపోయింది. ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకోవడం లేదు. అంతెందుకు నాగ్ కూడా గ్లామర్ కోల్పోయినట్టు పీలగా ఉన్నాడు. ఈ సినిమాపై అంచనాలు పెంచుకోవాల్సిన అవసరం లేదని ఈ సినిమాపై ఏర్పడిన బజ్ చూస్తేనే తెలిసిపోతోంది. కల్యాణ్ రామ్ – తమన్నాల ‘నా నువ్వే’ కూడా ఇదే సీజన్లో వస్తోంది. తమన్నా గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అయితే ఈ ఏజ్‌లో కల్యాణ్‌రామ్ లవ్ స్టోరీ చేయడం సాహసమే అనిపిస్తోంది. గెటప్ పరంగా కాస్త కొత్తగా కనిపించడం, పీసీ శ్రీరామ్ లాంటి టెక్నీషియన్స్ అండ దండలు ఉండడం ఒక్కటే ఈ సినిమాకి కలిసొచ్చే విషయం. ఈ నాలుగు సినిమాల సెన్సార్ రిపోర్టులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆ రిపోర్టులకే షాకిచ్చే రిజల్ట్ తెచ్చుకుంటే అంతకంటే కావల్సింది ఏముంది?