తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5
హైవేలో బండి స్పీడుగా వెళ్తోంది..
సడన్‌గా స్టీరింగ్ వదిలేయండి.
ఏమవుతుంది… బండి దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటుంది..
దేన్నో గుద్దుకునేంత వరకూ ఆగదు.
గాలి పటాన్ని ఎగరేయండి..
దారం తెంపేయండి
ఏమవుతుంది… ఎట్నుంచి ఎటో వెళ్లి… చివరికి ఏ కొమ్మకో, కరెంటు పోలుకో తగులుకుని.. చిరిగిపోతుంది.
‘నేల టికెట్టు’ చూస్తుంటే.. హైవేలో స్టీరింగ్ వదిలేసిన కారు, గాల్లో ఎగరేసి దారం తెంపేసిన గాలిపటం గుర్తొస్తాయి.
సినిమా మొదలైనప్పటి నుంచి చివరి సన్నివేశం వరకూ… కథ, కథనం, పాత్రలు, అవి పలికే సంభాషణలు, లాజిక్కులు ఇవన్నీ దర్శకుడి చేతికి కూడా అందకుండా చిత్రవిచిత్రంగా తిరిగితే.. ఆ సినిమాకి కచ్చితంగా ‘నేల టికెట్టు’ అనే పేరు పెట్టేయొచ్చు. ఇంకాస్త లోతుగా.. డిటైల్డ్‌గా… చెప్పుకోవాలంటే…
కథ
రవితేజ ఓ అనాథ. థియేటర్లో పెరుగుతాడు. నేల టికెట్టులో పడుకుంటాడు. అప్పటి నుంచీ అతన్ని నేల టికెట్టు అని పిలుస్తుంటారు. చుట్టూ జనం – మధ్యలో మనం – అనే కాన్సెప్ట్ తనది. ఎవరినైనా సరే వరుసలు పెట్టి పిలుస్తాడు. కాస్త ప్రేమిస్తే ఏమైనా చేస్తాడు. మరోవైపు ఆదిత్య భూపతి (జగపతిబాబు) కథ నడుస్తుంటుంది. తనో హౌం మినిస్టర్. డబ్బుల కోసం కన్నతండ్రినే చంపేస్తాడు. వాటికి సంబంధించిన ఆధారాలు ఓ జర్నలిస్టు దగ్గర ఉంటాయి. ఆమెను కూడా చంపాలని ప్రయత్నిస్తాడు. ఓ పనిమీద హైదరాబాద్ వచ్చిన నేల టికెట్టు.. హోమ్ మినిస్టర్ మనుషులతో గొడవ పెంచుకుంటాడు. అక్కడి నుంచి ఆదిత్య భూపతితో వైరం మొదలవుతుంది. ఆదిత్య భూపతి చేసిన తప్పులేంటి? వాటిని నేల టికెట్టు ఎలా బయటపెట్టాడు? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ
సీన్ నెం 1 నుంచి కథ, కథనాలు ఇష్టం వచ్చిన రీతిలో తిరిగేస్తుంటాయి. ఓ సన్నివేశానికీ మరో సన్నివేశానికీ కంటిన్యుటీ అవసరం లేకుండా.. ఇంత పేలవమైన స్క్రీన్ ప్లే దర్శకుడు ఎలా రాశాడా అనిపిస్తుంది. కోడి పెట్టని దొంగిలించాడన్న నేరం మీద.. ఓ పోలీస్ అధికారిని (జయప్రకాష్ రెడ్డి)ని కోర్టుకి ఈడ్చడం దగ్గరే ఈ కథ తిరోగమన దిశగా వెళ్తుందన్న విషయం అర్థమవుతుంది. ఆ తరవాత వచ్చే ప్రతీ సన్నివేశం మన అనుమానాన్ని బలం చేకూరుస్తూ ఉంటుంది. రోడ్డుపై అమ్మాయిని చూసి మనసు పారేసుకోవడం, ఆమె కోసం ప్రిన్సిపల్ మెడపై కత్తి పెట్టి, బెదిరించి ఆ కాలేజీలో.. కోటు వేసుకుని తిరిగే పర్మిషన్ సంపాదించడం.. ఇవన్నీ చూస్తుంటే దర్శకుడు మైండ్ పెట్టి ఆలోచించాడా, లేదంటే తోసింది రాసుకుంటూ వెళ్లిపోయాడా? అనిపిస్తుంది.
ఈ సినిమా ఎప్పుడూ ఒకే థ్రెడ్‌పై సాగదు. అనేక ముడులు వేసుకుంటూ వెళ్లాడు. సీనియర్ సిటిజన్స్ గొడవ, హోం మంత్రిపై మర్దర్ కేసు, పోలీసు ఉద్యోగాల్లో అవినీతి, ఎమ్మెల్యేలను కొనుక్కోవడం.. వీటన్నింటికి తోడు హీరోగారి పర్సనల్ పగ, అతని ప్రేమ, అద్దెంట్లో ఓనర్‌తో ఎటకారాలు, మందు సిట్టింగులు – పది సినిమాలకు పనికొచ్చే మెటీరియల్, ట్రాకులు పెట్టుకుని ఒక్క సినిమా, ఆ మాటకొస్తే ఒక్క సన్నివేశం కూడా సవ్యంగా తీయలేకపోయాడు. తనకు ఎప్పుడు ఏది గుర్తొస్తే.. ఆ ఎపిసోడ్‌ని తెరపైకి తీసుకురావడం.. పది నిమిషాలు కథ సాగదీయడం, అది అవ్వగానే మరోటి.. ఆ తరవాత ఇంకోటి…. ఇలా పేర్చుకుంటూ వెళ్లాడు తప్ప, చెబుతున్న పాయింట్‌కీ, ఎత్తుకున్న కథకీ ఏమాత్రం సంబంధం ఉందా? అనే డౌటు దర్శకుడికి ఒక్కసారి కూడా రాకపోవడం ప్రేక్షకుల పాలిట శాపంగా మారిపోయింది.
ద్వితీయార్థంలో దర్శకుడు ఏ స్థాయికి పడిపోయాడంటే – ఈ సినిమాని ఎలా ముగించాలో తెలీక… ఏది పడితే అది చేశాడు. ఏం తోస్తే అది రాశాడు. దాంతో. `సినిమా ఇంకా అవ్వడం లేదేంటి?` అనే కంగారు ప్రేక్షకుడిలో కలుగుతుంది.
`అయిపోయింది హమ్మయ్య` అనుకునేటప్పుడు హీరోగారి ఫ్లాష్ బ్యాక్, ఛైల్డ్ వుడ్ స్టోరీ చూపించాడంటే.. దర్శకుడ్ని ఏమనుకోవాలి? అప్పటికే హీరో ఏంటి? అతని ధ్యేయం ఏంటి? క్లైమాక్స్ లో ఏం జరగబోతోంది? అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఆ సమయంలో ఫ్లాష్ బ్యాక్‌లు అవసరమా? ప్రేక్షకుడిపై పగ పట్టడం కాకపోతే..?? లాజిక్ అనే మాట మర్చిపోయి ఈ సినిమా చూడాలి. లేదంటే అన్నీ తప్పులే. ట్రైన్ యాక్సిడెంట్ అందుకు పరాకాష్ట. ఎమ్.ఎల్.ఏలను కొనడానికి ఓ ట్రక్కు నిండా డబ్బు పెట్టుకుని హోం మినిస్టర్ మనుషులు తీసుకెళ్తుంటే.. ఓ ముఖ్యమంత్రి ఆపలేడా? ఇలా చెప్పుకుంటూ పోతే.. లోపాలు ప్రతీ చోటా, ప్రతీ సీన్లోనూ కనిపిస్తాయి.
నటీనటులు
రవితేజ ఉంటే చాలు.. ఇంకేం అవసరం లేదు.. అనుకునే రోజులు పోయాయి. రవితేజ సింగిల్ హ్యాండ్లో సినిమాని గట్టెక్కించే పరిస్థితి లేదు. కానీ కల్యాణ్ కృష్ణ మాత్రం రవితేజని నమ్ముకున్నాడు. రవితేజ శతవిధాలా ప్రయత్నించినా.. లాభం లేకుండా పోయింది. హీరోయిన్ మాళవిక శర్మకి ఇదే తొలి సినిమా. ఆమెపై కంటే.. హీరో చెల్లాయిపైనా, వ్యాంపు పాత్ర చేసిన క్యారెక్టర్‌పైనా కెమెరా ఎక్కువగా ఫోకస్ అయ్యింది. బ్రహ్మానందం లాంటి నటుడికి ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా ఇవ్వకుండా.. సైడ్ ఆర్టిస్టులా నిలబెట్టేశాడంటే… కల్యాణ్ కృష్ణ తెరపై ఇంకెన్ని విడ్డూరాలు చేశాడో ఊహించుకోవొచ్చు. కృష్ణవంశీ సినిమాలా.. తెర నిండా ఆర్టిస్టులే. కానీ ఒక్కరినీ వాడుకోలేదు. జగపతిబాబు పాత్రనీ సరిగా తీర్చిదిద్దలేకపోయాడు. దాంతో ఆయన కూడా రొటీన్ విలన్‌గా మిగిలిపోయాడు.
సాంకేతిక వర్గం
కారు కండీషన్లో లేనప్పుడు, ఇంజన్ బోరుకి వచ్చినప్పుడు ఏసీ పని చేయలేదు, టైర్లో గాలి తక్కువైంది అని వంకలు పెట్టడం లో అర్థం లేదు. ఇలాంటి కథ.. ఏ టెక్నీషియన్లోనూ ఉత్సాహం నింపదు. అందరూ డబ్బుల కోసమే పనిచేశారనిపిస్తోంది. పాటల్లో ఒక్కటీ ఆకట్టుకోలేదు. వాటి ప్లేస్మెంట్ కూడా… దారుణంగా ఉంది. పాటొస్తే.. బయటకు పారిపోవడానికే చూస్తున్నారు జనాలు. కల్యాణ్ కృష్ణ బలహీనతలన్నీ.. ఈ సినిమాతో బయటపడిపోయాయి. దర్శకుడిగా, రచయితగా రెండు రంగాల్లోనూ విఫలమయ్యాడు.
తీర్పు
దర్శకుడికి గానీ, కథానాయకుడికి గానీ తమపై తమకు విశ్వాసం ఉండాలి. మితిమీరిన విశ్వాసం అస్సలు పనిచేయదు. ప్రేక్షకుల్నీ తక్కువ అంచనా వేయకూడదు. `ఏం తీసినా జనం చూస్తారులే` అనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, ప్రేక్షకుల అభిరుచినీ తక్కువ చేసినట్టే. ఈ రెండు అవ లక్షణాలూ… ‘నేల టికెట్టు’లో కనిపించాయి.
ఫినిషింగ్ టచ్: టికెట్టు ‘చిరిగిపోయింది’
తెలుగు360.కామ్ రేటింగ్ : 1.5/5