తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని తన ఆదాయవనరుగా మార్చుకుని కాంట్రాక్ట్ పొందిన జీఎంఆర్ తో డీల్ కోసం చాలా రోజుల పనులు ఆపేసి.. కాకినాడ సెజ్ లెక్కలు చూసుకుని మళ్లీ జీఎంఆర్కు కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ పనులు సాగలేదు. ఈ భోగాపురంలో వైసీపీ అగ్రనేతలు చేసిన దందాలు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేశాయి. ఆ బాధితుల్లో ఒకరు లోకం మాధవి. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రతిపాదన లేని రోజుల్లో దశాబ్దాల కిందటే అక్కడ వారికి ఆస్తులు ఉన్నాయి. కానీ జగన్ ప్రభుత్వం టార్చర్ పెట్టి ఎన్నో ఆస్తులు స్వాధీనం చేసుకుంది. ఈ పోరాటంలో ఆమె చూపించిన తెగువ నాయకురాలిగా నిలబెట్టింది. జనసేన పార్టీ అభ్యర్థిగా .. టీడీపీ మద్దతుతో ఇప్పుడు వైసీపీ అంతానికి పోరాడుతున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బొత్స బంధువు బడ్డుకొండ అప్పల నాయుడు భారీ మెజార్టీతో గెలిచారు. కానీ ఈ సారి పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉంది. గత ఎన్నికల్లో భోగాపురం వైసీపీ నేతలు కష్టపడి పని చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అంతా ఎవరి ాదరి వారు చూసుకున్నారు. చాలా మంది నాయకులు జనసేనలో చేరిపోయారు. ఇప్పటికి ఉన్న నేతలు పని చేయడం లేదు. సంపాదనలో అవకాశాలు కొంత మందికే వచ్చాయని ఎక్కువ మంది అలగడం బడ్డుకొండకు కాస్త తలనొప్పిగా మారింది. పూస పాటిరేగ, డెంకాడ మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భారీ స్థాయిలో నాయకులు జనసేనలో చేరారు.
నియోజక వర్గ కేంద్రమైన నెల్లిమర్ల గత ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజార్టీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం నాటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే నియోజక వర్గానికి ప్రధాన కేంద్రమైన నెల్లిమర్ల, జరజాపుపేటలో వైసిపిని వీడి నగర పంచాయతీ చైర్పర్సన్, కౌన్సిలర్, మరికొంత మంది జనసేనలో చేరారు. దీంతో సుమారు పదివేల ఓట్లు ఉండే ఈ రెండు గ్రామాల్లో వైసీపీ పట్టు తగ్గిందన్న వాదన వినిపిస్తుంది. నెల్లిమర్ల ఎంపీపీ అంబళ్ల సుధారాణి కూడా గతంలో పార్టీ నాయకుల వ్యవహారం నచ్చక రాజీనామా వరకూ వెళ్లారు. ఎలాగోలా బుజ్జగించి పార్టీ మారకుండా చూసుకున్నారు కానీ ఆమె వ్యతిరేకంగా పని చేస్తున్నారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. నయానో భయానో కొంత మందిని పార్టీలో ఉంచుతున్నారు కానీ.. వారు ఓట్లు వేయడం.. వేయించడం చేయడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.
జనసేన అభ్యర్థి లోకం నాగ మాధవి అందర్నీ కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు టిక్కెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రాకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఆయనకు భీమిలి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు ప్రయత్నించారు . కానీ గంటా తో సమీకరణాలు కుదరకపోవడంతో ఆయనకు ఇవ్వాల్సి వచ్చింది. కర్రోతుకు భవిష్యత్ లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మాధవిని ఎలాగైనా గెలిపించుకుని తీసుకు రావాలని సూచించారు. కర్రోతు బంగార్రాజు దగ్గరుండి ప్రతి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఆమె గెలుపు కోసం పనిచేస్తున్నారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు మనస్ఫూర్తిగా పని చేస్తే మాధవి విజయం ఖాయమన్న అభిప్రాయం ఉంది. ఈ నియోజకవర్గంలో 90 శాతం పైగా బీసీలు ఉన్నారు. ఇందులో అధిక శాతం కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే బడ్డుకొండ తనకే వారంతా ఓటు వేస్తారని భావించి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాపు వర్గం జనసేన వైపు ఉంటుందని లోకం మాధవి ధీమాగా ఉన్నారు.