ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సాధారణం గా దేవుడి పేరిట ప్రమాణం చేస్తూ ఉంటారు. ఒకవేళ నాస్తికులు అయితే, అంతరాత్మ సాక్షిగా, రాజ్యాంగానికి లోబడి ఉంటానని ప్రమాణం చేస్తూ ఉంటారు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాత్రం దేవుడి పేరిట బదులుగా తాను జగన్ పేరిట ప్రమాణం చేస్తానని చెప్పడం అసెంబ్లీ లోనే కాకుండా దాన్ని చూసిన జనాలకు కూడా విస్మయాన్ని కలిగించింది. అయితే కొందరు పరిశీలకులు మాత్రం ఇది కేవలం ఆరంభమే నని ఇటువంటి సిత్రాలు ముందు ముందు చాలా చూడాల్సి ఉంటుందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు సహా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వీరిలో దాదాపు అందరూ కూడా దేవుడి పేరిట ప్రమాణం చేశారు. ముస్లిం ఎమ్మెల్యే అయినా అంజాద్ బాష అల్లా పేరిట ప్రమాణస్వీకారం చేశారు. అయితే, నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, జగన్ పేరిట ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రొటెం స్పీకర్, అలా చేయటానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పి, దీనిని అంగీకరించలేదు. అయితే శ్రీధర్ రెడ్డి మాత్రం గతంలో కొందరు ఎమ్మెల్యేలు ఇలాగే వారి అభిమాన నాయకుడి మీద ప్రమాణస్వీకారం చేశారని, కాబట్టి దీన్ని అంగీకరించాల్సిందే నని అన్నారు. అయితే చివరికి ప్రొటెం స్పీకర్ సూచన మేరకు మళ్లీ దేవుడి పేరిట ప్రమాణస్వీకారం చేశారు.
ఏది ఏమైనా, అధి నాయకుడికి విధేయంగా ఉండడం మంచిదే కానీ, తెలుగు లో ఏదో సామెత చెప్పినట్లు అతివినయం మొదటికే మోసం తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ పట్ల తమవిధేయతను ప్రకటించుకోటానికి ఎమ్మెల్యేలు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ ఉన్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఇలాంటి సిత్రాలు మరిన్ని చూడాల్సి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరిముఖ్యంగా రెండేళ్ల తర్వాత మరొకసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ చెప్పిన నేపథ్యంలో, ఆ విస్తరణ జరిగే వరకూ ఇలాంటి విచిత్రాలు ఇంకా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండవచ్చు.