ఇద్దరు దొంగలు.. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ దగ్గర ఉన్న మెటీరియల్ను దొంగతనం చేయడానికి వెళ్లారు. అక్కడ అంతా బయటే ఉన్నా.. వాటిని దొంగతనం చేయడానికి వారికి సాధ్యం కాలేదు. ఆ బిల్డింగ్ వెనకాలే ఉన్న భవనం చూశారు. అందులో ఏమైనా దొరుకుతాయేమోనని దొంగతానానికి వెళ్లారు. ఓ రూమ్ పగలగొట్టి దొరికిన సంచి తీసుకుని బయటపడ్డారు. అందులో ల్యాప్ ట్యాప్ ఓ ట్యాబ్ సెల్ ఫోన్లు ఉంటే తీసుకుని వెళ్లిపోయారు. మిగతావి అక్కడే పడేశారు. చాకచక్యంగా వారిని పోలీసులు పట్టుకున్నారు. మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఇదంతా నెల్లూరు కోర్టులో దొంగతనం కేసులో పోలీసులు .. నిందితుల్ని పట్టుకున్న వైనం.. నేరం జరిగిన వైనం. ఆ దొంగలిద్దరూ అప్పటికే పధ్నాలుగు కేసుల్లో ఏ వన్ ముద్దాయిలట. అలాంటి వారికి అది కోర్టు అని తెలియదా.. కోర్టు అని తెలిసి కూడా దొంగతనానికి పాల్పడ్డారా … లాంటి విషయాలను ఎవరూ అడక్కూడదు .. ఎందుకంటే పోలీసులు చెప్పరు.
దొంగలిద్దర్నీ అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు. ఒక లాప్ టాబ్, ఒక టాబ్, 4 సెల్ ఫోన్లు, 7 సిమ్ కార్డులను రికవరీ చేశామని తెలిపారు. పక్కా ఆధారాలతో నిందితుల్ని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ విజయరావు చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తం లాజిక్కులు లేని సినిమా కథలా అనిపించినా.. నమ్మాల్సిందే. ఎందుకంటే చెప్పింది పోలీసులు మరి.