“ఆదాల ప్రభాకర్ రెడ్డి.. కట్నం తీసుకుని పెళ్లి పీటల మీద నుంచి పారిపోయిన పెళ్లికొడుకు..! ఇలాంటి వాళ్లకు తగిన బుద్ది చెప్పాలి..! “… నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇదే డైలాగ్‌ను హైలెట్ చేస్తున్నారు. ఇది చాలా క్యాచీగా ఉండటంతో… విస్త్రతంగా ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. దీనికి కారణం.. ఆదాల ప్రభాకర్ రెడ్డి.. అచ్చంగా… కట్నం తీసుకుని పారిపోయిన పెళ్లికొడుకులా వ్యవహరించడమే. అధికార పార్టీగా ఉన్న టీడీపీతో సన్నహితంగా ఉండి.. నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసేందుకు అంగీకరించి… తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులను మంజూరు చేయించుకుని… వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే ముందు రోజు… హైదరాబాద్ లోటస్‌పాండ్‌కి వెళ్లి జగన్‌తో కండువా కప్పించుకున్నారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అధికారపార్టీని అత్యంత పకడ్బందీగా ఆదాల మోసం చేసిన విధానం చూసి… ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ వ్యవహారంలో.. ఆదాల ప్రజల నోళ్లలో నానారు.
గత ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ టీడీపీకి జస్ట్ మిస్..!
ఆదాల చేసిన మోసం కారణంగా… టీడీపీ.. టిక్కెట్లు, సామాజిక సమీకరణాల్లో భాగంగా నెల్లూరు పార్లమెంట్ నుంచి.. అభ్యర్థిగా.. బీద మస్తాన్ రావును రంగంలోకి దింపింది. కావలి అసెంబ్లీకి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆయన..అనూహ్యంగా… లోక్‌సభ నియోజకవర్గానికి బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ నియోజకవర్గ పరిధిలో బీసీ జనాభా అత్యధికంగా ఉండటం…. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి గట్టి పట్టు ఉండటంతో.. బీద ప్రచారంలో ముందున్నారు. గత ఎన్నికల్లో గట్టి అభ్యర్థి అనుకున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి బయటపడింది.. కేవలం పదమూడు వేల ఓట్ల తేడాతోనే. ఈ సారి ఆదాలపై.. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండటం.. బీసీ అభ్యర్థిగా బీద మస్తారావు… ప్రజల్లోకి చొచ్చుకెళుతూండటంతో… ఆయన అవకాశాలు మెరుగయ్యాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ హోరాహోరీ పోరు నడుస్తోంది. బీదకు ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కందుకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, ఉదయగిరి నియోజకవర్గాల్లో బీద మస్తాన్ రావుకు మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు నడుస్తోంది.
బీద మస్తాన్ రావుకు అండగా బీసీలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. అనేక చోట్ల… గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఆదాల వ్యవహారశైలితో చాలా మందినేతలు విసిగిపోయారు. ఆయన.. ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేసుకోండి.. ఎంపీగా ఓటు మాత్రం తనకే వేయండి.. అన్న సందేశాన్ని ఓటర్లలోకి పంపుతున్నారు. దీంతో.. ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా… ఎంపీగా ఎవరికైనా ఓటు వేసుకోండి.. ఇంకా కావాలంటే.. బీసీ అభ్యర్థిగా బీసీ మస్తాన్ రావుకే వేసుకోండి.. ఎమ్మెల్యే ఓటు మాత్రం మాకే వేయండి అని ప్రచారం చేస్తున్నారు. ఇలా వైసీపీ .. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు… ఒకరికొకరు విశ్వాసం లేకుండా ప్రచారం చేసుకుంటూండటంతో.. మొత్తానికే.. తేడా వచ్చే పరిస్థితి ఏర్పడింది.
కావలిలో భారీ మెజార్టీ ఖాయమే..!
బీద మస్తాన్ రావుకు… జిల్లా వ్యాప్తంగా పట్టు ఉంది. ఆయనకు కావలి నియోజకవర్గంలో వచ్చే మెజార్టీ కీలకంగా మారనుంది. ఇప్పటి వరకూ కావలిలో.. టీడీపీ తరపున పోటీ చేస్తున్న విష్ణువర్థన్ రెడ్డి, బీద మస్తాన్ రావు వర్గాలుగా పోరాడేవారు.ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయారు. వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి… ఐదేళ్లలోనే చాలా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. మొత్తానికి కట్నం తీసుకుని పారిపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని… ప్రజలు.. అంతే ట్రీట్ చేసే అవకాశాలు మాత్రం ప్రస్ఫుటంగా ఉన్నాయి. బీదమస్తాన్ రావుకు.. అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా.. వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.