ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ట్రెండ్ పుంజుకుంటోంది. నెల్లూరు ఏపీలోని ఓ ప్రధాన నగరం. విద్యా, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా ఉంది. చెన్నై దగ్గరగా ఉండటంతో పారిశ్రామిక రంగం కూడా వృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో రియల్ రంగం కూడా అదే పంధాలో ఉంది.
నెల్లూరు నగరం సమీపంలోని ధనలక్ష్మీపురం , అల్లిపురం రోడ్ , నాయిడుపేట , పొదలకూరు రోడ్ వంటి చోట్ల ఇళ్ల వెంచర్లు విపరీతంగా పెరిగాయి. ధనలక్ష్మీపురం, కాకుపల్లి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్నాయి. కృష్ణపట్నం పోర్ట్ రోడ్‌కు సమీపంలో ధనలక్ష్మిపురం ఉండటం.. నీటి సమస్య లేకపోవడంతో గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ స్థలాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో ఇరవై లక్షలు పెడితే ఇంటి స్థలం లభిస్తోంది.
కాకుపల్లి ప్రాంతంలో NUDA ఆమోదిత లేఅవుట్లు ఎక్కువగా ఉన్నాయి. వివాదాలు లేని ప్రాంతం కావడంతో రుణాలు సులభంగా లభిస్తున్నాయి. ఇక్కడ కాస్త ధర ఎక్కువగా ఉంటుంది. పాతిక లక్షల వరకూ పెడితే రెండు వందల గజాల స్థలం లభిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అల్లిపురం రోడ్, నాయిడుపేట ప్రాంతాలు కమర్షియల్ గా కూడా డిమాండ్ ఉన్న ప్రాంతాలు. ఇక్కడ రేటు కాస్త ఎక్కువగానే ఉంటోంది.
నెల్లూరులో ఇంటిస్థలంపై పెట్టుబడి పెడితే ఐదేళ్లలో రెట్టింపు అవుతుందన్న నమ్మకం అక్కడి ప్రజల్లో ఉంది. నెల్లూరుతో అనుబంధం ఉన్న వారు ఇంటి స్థలం కొని పెట్టుకోవడం కామన్‌గా మారింది.