నెల్లూలు జిల్లా వైసీపీ కంచుకోట అనుకోవచ్చు. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ జిల్లాలో ఉన్న మొత్తం పది సీట్లలో ఓ సారి ఎనిమిది.. మరోసారి పదికి పది సీట్లు గెల్చుకున్నారు. ఇప్పుడు మూడో సారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూంటే.. అసలు వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీటు ఉందా అని ఆ పార్టీ నేతలు వెదుక్కునే వాతావరణం ఏర్పడింది.
గత ఎన్నికల్లో పది కి పది సీట్లు గెల్చుకున్న వైసీపీలో దిగ్గజ నేతలు ఉన్నారు. ఆనం ఫ్యామిలీ, మేకపాటి ఫ్యామిలీ, నేదురుమల్లి ఫ్యామిలీ, వేమిరెడ్డి ఫ్యామిలీ ఇలా అందరూ ఉన్నారు. ఆర్థికంగా.. ప్రజల్లో పట్టు ఉన్న నేతలుగా వారంతా తలా ఓ చేయి వేయడంతో పది కి పది సీట్లు వచ్చాయి. ఐదేళ్లు తిరిగే సరికి ఇప్పుడు వైసీపీకి మిగిలింది మేకపాటి ఫ్యామిలీనే. కానీ ఆ ఫ్యామిలీలో మేకపాటి గౌతంరెడ్డి చనిపోవడం.. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి దూరం కావడంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వయోభారం కారణంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి చురుగ్గా ఉండలేకపోతున్నారు. ఆ కుటుంబానికి ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవకర్గాల టిక్కెట్లు ఇచ్చారు జగన్. కానీ ఈ సారి ఆత్మకూరులో ఆనం పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా హోప్స్ లేవన్న ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు సిటీ, రూరల్లో వైసీపీ ఎప్పుడో చేతులెత్తేసింది. నారాయణ, శ్రీధర్ రెడ్డిలకు భారీ మెజార్టీలు వస్తాయని పందెలు జరుగుతున్నాయి. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ వ్యవహారశైలి కారణంగా వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణికి చాన్స్ ఇవ్వడంతో… టీడీపీకి అనుకూలంగా మారిపోయింది. వెంకటగిరిలో ఆనం మద్దతుతో టీడీపీ ముందంజలో ఉంది. కావలిలో వరుసగా గెలుస్తూ వస్తున్న రామిరెడ్డి నిర్వాకాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి హవా నిపిస్తోంది. సర్వేపల్లిలో వరుసగా ఓడిపోతున్న సోమిరెడ్డిపై సానుభూతి కనిపిస్తోంది.
ఎంపీ సీటుకు ఎవరూ దొరక్క విజయసాయిరెడ్డిని నిలబెట్టారు. కానీ ఆయన గెలిచినా ఓడినా పోయేదేమీ లేదన్నట్లుగా ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. చివరికి వేమిరెడ్డి మళ్లీ వైసీపీలోకి వస్తారని ప్రచారం ప్రారంభించారు. వేమిరెడ్డి టీడీపీలో చేరిన తర్వాతే అసలు వైసీపీ వాష్ అవుట్ అయిందన్న అభిప్రాయం బలపడింది. నిజానికి వేమిరెడ్డి మాస్ లీడర్ కాదు. కానీ ఆయన తో పాటు వైసీపీ సగం క్యాడర్ టీడీపీలోకి వచ్చింది. అందుకే మళ్లీ వేమిరెడ్డి వైసీపీ లోకి వస్తారని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై ఆ దంపతులు .. వైసీపీ పరువు పోయేలా రిప్లయ్ ఇచ్చారు.
ఎంత చేసినా ఈ సారి నెల్లూరులో వైసీపీకి అతి కష్టం మీద వైసీపీ ఒకటి, రెండు సీట్లు గెల్చుకున్నా అద్భుతమేనని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.