తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5
మామా వెనకటికి ఓ సామెత ఉంది… అంటూ జోగేంద్రగా రానా పేలిపోయే డైలాగులు చాలా చెబుతాడు సినిమాలో. అదే తరహాలోనే దర్శకుడు తేజ ఇటీవల మీడియాతో ఓ డైలాగ్ చెప్పాడు… మీ పనైపోయిందని మాట్లాడుకొంటున్నారు కదా బయట అన్న ప్రశ్నకు! `మామా… అస్సలు పనిలేనివాళ్లే నా పనైపోయిందని మాట్లాడుకొనేది` అన్నట్టుగా ఆయన ఠపీమని సమాధానం చెప్పాడు. `నేనే రాజు నేనే మంత్రి` చూస్తే నిజంగా ఆయన చెప్పిందే కరెక్టన్న విషయం అర్థమవుతుంది. తేజ పని అయిపోలేదని, ఆయనలో ఇంకా చాలా పస ఉందని… ఆయన్నుంచి మునుపటిలా మరిన్ని మంచి సినిమాలు ఆశించొచ్చని `నేనే రాజు నేనే మంత్రి` నిరూపిస్తుంది. అలాగని మచ్చలేని కళాఖండమేమీ ఆయన తీయలేదు. లోటుపాట్లు కొన్ని కనిపిస్తాయి కానీ, ఆ వెంటనే తేజ పేలవమైన ఫామ్ గుర్తుకొచ్చి `ఈమధ్య ఆయన సినిమాలతో పోల్చి చూసుకొంటే ఇది బాహుబలికంటే మిన్న` అనిపించి వందకి తొంభై మార్కులు వేయాలనిపిస్తుంది. ఇంతకీ సినిమాలో రాజు ఎవరో మంత్రి ఎవరో చూద్దాం పదండి…
కథ
జోగేంద్ర (రానా)కి వడ్డీ వ్యాపారం చేయడమంటే చాలా ఇష్టం. ఏదో ఒకటి తాకట్టు పెట్టుకొని తెలివిగా వ్యాపారం చేస్తుంటాడు. దాంతో పాటు ఆయనకి మరో ఇష్టం కూడా ఉంది. ఆ ఇష్టం పేరు రాధ (కాజల్). జోగేంద్ర భార్య. ఆమె సంతోషమే లోకం అనుకుంటాడు. రాధ మూడేళ్ల తర్వాత గర్భం దాల్చడంతో ఆమెని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెడతాడు. ఇంతలోనే ఆ ఊరి గుడి దగ్గర తన కంటే ముందే వచ్చి దీపం వెలిగించిందనే కోపంతో గ్రామ సర్పించి (ప్రదీప్‌రావత్) భార్య రాధని కిందకి తోసేస్తుంది. దాంతో ఆమె గర్భం పోవడంతో పాటు, చావుకి దగ్గరగా వెళుతుంది. తన భార్యని కాపాడుకొన్న జోగేంద్ర ఎలాగైనా రాధకోసం ఊరికి సర్పించి కావాలనుకొంటాడు. అత్యంత క్రూరమైన వ్యక్తిత్వమున్న సర్పించిని తన తెలివితేటలతో మాయ చేసి ఎన్నికల్లో గెలుస్తాడు జోగేంద్ర. ఆ తర్వాత ఇలాంటి ఎత్తులతోనే ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత మంత్రి అవుతాడు. ఇక సీఎం కావడమే లక్ష్యం అనుకొన్న జోగేంద్రకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? పదవి కోసం ఏం చేశాడు? రాధే లోకం అనుకున్న జోగేంద్ర రాజకీయాల్లోకి వచ్చాక ఎలా మారాడు? జోగేంద్ర కోసం రాధ ఏం చేసింది? తదితర విషయాలతో మిగతా సినిమా సాగుతుంది.
విశ్లేషణ
తెలుగు తెరపై రాజకీయ నేపథ్యంతో కూడిన సినిమాలు చాలా అరుదు. రాజకీయం అంటే లోతైన వ్యవహారం. చాలా విషయాల్ని పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుంది. ఎత్తులు, పైఎత్తులు పక్కాగా లేకపోతే అభాసుపాలు కావల్సి వస్తుంది. అవన్నీ కుదిరితే మాత్రం కథ ఎక్కడికో వెళ్లిపోతుంది. ఎంతైనా ఇదంతా రిస్క్ వ్యవహారం అనుకుంటారో ఏంటో తెలియదు కానీ.. ఆ సబ్జెక్ట్‌ని పైపైన టచ్ చేస్తూ వెళ్లిపోయేవాళ్లే ఎక్కువ. తేజ మాత్రం తనకే కాకుండా, తెలుగు ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుందనుకొని ఈసారి రాజకీయంలోకి దిగాడు. ఎత్తులు, పైఎత్తులతో కూడిన కథని పక్కాగా రాసుకున్నాడు. అయితే ఎత్తులు మరీ ఎక్కువైతే ప్రేక్షకుడిలో కన్ఫ్యూజ్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే తేజ తెలివిగా పాత్రల్లోనే ఇంటెలిజెన్సీని చూపిస్తూ కథని మాత్రం పండితుల దగ్గర్నుంచి పామరుల దాకా అర్థమయ్యేలా తీర్చిదిద్దాడు. దాంతో ప్రతి సన్నివేశం రక్తికడుతుంది. ఎక్కడా తాత్సారం చేయకుండా నేరుగా కథలోకి వెళ్లిపోయిన తేజ పది నిమిషాల్లోపే ప్రేక్షకుల్ని సీట్లకి కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. ఎమ్మెల్యే ఇంట్లో ఓడిపోయిన సర్పంచికీ, జోగేంద్రకీ మధ్య రాజీ కుదిర్చే సన్నివేశాలు సినిమాకి ఊపుని తీసుకొచ్చాయి. అక్కడ రానా నటన హైలెట్. అది మొదలు ప్రతి పది నిమిషాలకొకసారి, ప్రతి పాత్ర తనదైన శైలిలో ఎత్తులు వేస్తూ వెళ్లిపోతుంటుంది. దాంతో సన్నివేశాలు థ్రిల్‌ని కలిగిస్తాయి. చివరిదాకా సినిమాలో ఎత్తులే. కానీ ఈ ఎత్తుల్లో రానాకి ఎదురు దెబ్బలు తగలకుండా దూసుకెళ్లే వైనం మాత్రం సన్నివేశాల్లో సహజత్వాన్ని ప్రశ్నిస్తుంటాయి. జోగేంద్ర ఎమ్మెల్యే కావడం వరకు అంతా ఓకే అనిపిస్తుంది. కానీ మంత్రి అవ్వాలని ఎత్తులు వేయడం, సీఎం సీటుపై కన్నేయడం వంటి పరిణామాలు మాత్రం కాస్త ఓవర్‌గా అనిపిస్తాయి. అయితే పాత్రల్లోని సీరియస్‌నెస్, రానా నటన ఆ విషయాల్ని మరిచిపోయేలా చేస్తాయి. ద్వితీయార్థంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన మెలోడ్రామా ఎక్కువవడంతో పొలిటికల్ రేసు కాస్త పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలతో కథ ట్రాక్‌లోకి వస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం తెలుగు సినిమాకి భిన్నంగా సాగుతాయి. అక్కడ సన్నివేశాలు ప్రజెంట్ పొలిటికల్ సినారియోని గుర్తుకు తెప్పిస్తాయి.
నటీనటులు…
సాంకేతికత బాహుబలి, ఘాజీ చిత్రాల తర్వాత అందుకు దీటైన నటనతో మెప్పించాడు రానా. జోగేంద్రగా ఆయన ఒదిగిపోయాడు. స్టార్ లీగ్‌కి వెళ్లే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఈ చిత్రంలో నటన చాటి చెబుతుంది. కాజల్ అయితే రాధ పాత్రకి తూకం వేసినట్టుగా ఉంది. ఆమె హుందాగా కనిపించిన వైనం, భావోద్వేగాలతో కూడిన నటన సూపర్బ్ అనిపిస్తాయి. కేథరిన్ ఓ నెగిటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయిగా నటించింది. ఆమె కూడా పాత్రకి ఎంత కావాలో అంత చేసి మార్కులు కొట్టేసింది. అశుతోష్ రాణా, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, నవదీప్, అజయ్ తదితరులంతా కూడా ఎఫెక్టివ్‌గా నటించారు. పాత్రల్ని మలిచిన విధానం చాలా బాగుంది. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులు పడతాయి. అనూప్ రూబెన్స్ సంగీతం, వెంకట్ సి.దిలీప్ చాయాగ్రహణం బాగా కుదిరాయి. అంతా ఒకెత్తైతే, లక్ష్మీభూపాల్ మాటలు మరో ఎత్తు. సామెతలతోనూ, మాటలతోనూ అదరగొట్టాడాయన. తేజ కథకుడిగా, దర్శకుడిగా సత్తాని చాటాడు. అయితే అక్కడక్కడ ఇల్లాజికల్‌గా అనిపిస్తాయి కొన్ని సన్నివేశాలు. కథని కూడా వేరొకరి పాయింట్ ఆఫ్ వ్యూలో మొదలుపెట్టుంటే బాగుండేది. అంత పెద్ద వ్యవహారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రి అభ్యర్థి తన గురించి తాను చెప్పుకొన్నప్పుడే బయటికి అన్ని విషయాలు తెలుస్తాయా? అప్పటికే జనం నోళ్లల్లోనూ, మీడియా అతని గురించి కోడై కూస్తుంటుంది. అతని నేపథ్యాన్ని వేరొకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించుంటే కథలో సహజత్వం ఉట్టిపడేది. అలా కాకుండా, ఆయనే ఈ కథని చెప్పడం కథకి అతకలేదనిపిస్తుంది.
ఫైనల్‌గా..:
తెలుగు తెరపై చాలా రోజుల తర్వాత ఆవిష్కృతమైన మరో కొత్త రకమైన సినిమా `నేనే రాజు నేనే మంత్రి`. తేజని మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చిన ఈ సినిమా, రానా కోసం మరిన్ని కొత్త కథలు తయారు చేసేలా దర్శకులకు స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంది.
తెలుగు360.కామ్ రేటింగ్ 2.75/5