Nenu Student Sir Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
చిన్న పాయింట్లతో సినిమా తీయడం ఎప్పుడూ రిస్క్ ఫ్యాక్టరే. పాయింట్ బాగుంటుంది. కానీ దాన్ని పట్టుకొని రెండున్నర గంటల సినిమా తీయడం మాత్రం కత్తి మీద సాము లాంటి వ్యవహారం. ‘నేను స్టూడెంట్ సార్’ ఓ చిన్న పాయింట్ ని బేస్ చేసుకొన్న కథ. హీరో ఎంతో ఇష్టపడి కొనుకొన్న సెల్ ఫోన్ పోతుంది. దాని కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ, కమీషనర్ చుట్టూ తిరుగుతుంటాడు. ఆ ఫోన్ వల్ల… తనకు తానే రిస్క్‌లో పడిపోతాడు. ఆ తరవాత ఏమయ్యిందన్నదే కథ. పాయింట్ గా చూస్తే… ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఓ థ్రిల్లర్ కి ఉండాల్సిన లక్షణాలూ ఉన్నాయి. మరి… సినిమాగా ఈ పాయింట్ వర్కవుట్ అయ్యిందా? లేదా? ‘స్వాతిముత్యం’తో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ గణేష్‌కి తొలి హిట్ ఈ సినిమాతో అయినా దక్కిందా?
సుబ్బు (బెల్లంకొండ గణేష్) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. యూనివర్సిటీ స్టూడెంట్. ఐ ఫోన్ అంటే ప్రాణం. ఎలాగైనా సరే.. ఓ మంచి ఐఫోన్ కొనుక్కోవాలన్నది తన తాపత్రయం. చిన్నా, చితకా పనులు చేసి డబ్బులు కూడబెడతాడు. ఐ ఫోన్ కొనుక్కొంటాడు. దానికి ఓ పేరు కూడా పెట్టుకొంటాడు. కానీ ఫోన్ కొన్న తొలి రోజే… అనుకోకుండా జరిగిన ఓ గొడవ మీద పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సివస్తుంది. అక్కడ ఫోన్ పోతుంది. పోలీసులే తన ఫోన్ దొంగిలించారన్నది సుబ్బు అభియోగం. పోలీసులపై నింద వేసే సరికి.. కమీషనన్ అర్జున్ వాసుదేవ్ (సముద్రఖని) మండిపడతాడు. ‘నీ ఫోన్ దొరికినా నీకు ఇవ్వను… ‘ అని ఈగోకి వెళ్లిపోతాడు. ఎలాగైనా సరే… ఫోన్ దక్కించుకొంటానని సుబ్బు శపథం చేస్తాడు. ఆ తరవాత ఏమైంది? ఆ ఫోన్ వల్ల సుబ్బు జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? అనేదే కథ.
ముందే అనుకొన్నట్టు చాలా చిన్న పాయింట్ తో ఈ సినిమా తీశారు. పాయింట్ చిన్నదే అయినా.. ఆసక్తికరమైన కథనాన్ని జోడిస్తే వర్కవుట్ అయిపోతుంది. ఓంకారంతోనే కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. ఐఫోన్ అంటే హీరోకి ఎంత ఇష్టమో చూపిస్తూ.. అందుకోసం ఎంత కష్టపడుతున్నాడో ఓ పాటలో చూపించేశాడు. ఆ తరవాత ఐఫోన్ కొనుక్కోవడం, తొలి రోజే పోగొట్టుకోవడం, చివరికి కమీషనర్‌తో గొడవ పెట్టుకోవడం ఇవన్నీ చక చక సాగిపోతాయి. కానీ ఎక్కడైతే ఈ కథకు బ్రేక్ పడకూడదో… అక్కడే పడిపోయింది. ఐఫోన్ దక్కించుకోవడం కోసం కమీషనర్ కూతురుతో స్నేహం చేయాలనుకొంటాడు హీరో. అక్కడ హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇస్తుంది. ఆమె ఫిలాసఫీ, మంచితనం.. ఇవన్నీ చూపించి కాస్త విసిగించాడు. ఈ సినిమాతో భాగ్యశ్రీ కుమార్తె అవంతిక ఈ సినిమాలో శ్రుతి పాత్ర పోషించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్, నటన ఏమాత్రం ఆకట్టుకోవు. దాంతో ఆ పాత్రతో ట్రావెల్ చేయడం కష్టం అవుతుంది. అలా.. ఈ లవ్ ట్రాక్ కాస్త గాడి తప్పేసింది. సెల్ ఫోన్ అంటే మోజు, ఇష్టం ఉండడం ఓకే. కానీ… ఆ ఫోన్‌ని తమ్ముడు అనుకోవడం, ఫోన్‌తో మాట్లాడడం ఓవర్ ఎమోషన్స్. హీరోకి ఐఫోన్ అంటే ఇష్టం కాబట్టి, ఇన్ని రిస్కులు చేస్తున్నాడు.. అని ప్రేక్షకుడు అనుకొంటే తప్ప ఈ కథని ఫాలో అవ్వలేడు. ‘ఆఫ్ట్రాల్ ఐఫోన్ కోసం ఇంత రిస్క్ చేయాలా?’ అనుకొంటే మాత్రం ఈ సినిమా ముందు సీన్లలోనే పట్టాలు తప్పేస్తుంది.
ఓ మర్డర్ కేసుతో హీరోకి లింకు పెట్టడదం దగ్గర ఇంట్రవెల్ కార్డు పడుతుంది. ఈ ట్విస్ట్ ప్రేక్షకుల్ని మళ్లీ సీట్లకు అతుక్కొనేలా చేస్తుంది. సెకండాఫ్‌పై దృష్టి పడుతుంది. కానీ… ద్వితీయార్థం హీరో తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకొనే పనులు, తన ఐడియాలూ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఫీల్ ని మాత్రం కలిగించవు. ఫస్టాఫ్‌లో చెప్పిన కథ, సెకండాఫ్‌లో చూపించిన కథ.. రెండూ వేర్వేరేమో అనిపిస్తాయి. అన్ ఆర్థరైజ్డ్ బ్యాంక్ ఎకౌంట్స్ అనే కొత్త టాపిక్ ద్వితీయార్థంలోకి వస్తుంది. నిజానికి అది చాలా పెద్ద క్రైమ్. దాన్ని హీరో బయటకు లాగిన విధానంలో ఆసక్తి లేదు. కాకపోతే.. స్టూడెంట్స్ అంతా బ్యాంక్ కి వెళ్లి, డబ్బు విత్ డ్రా చేసుకొచ్చే సీన్ బాగా పండింది. ఈ కథలోకి స్టూడెంట్స్ మొత్తాన్ని ఇన్వాల్వ్ చేసి, వాళ్లతో హీరో గేమ్ ప్లాన్ చేస్తే బాగుండేది. టైటిల్ కి మరింత జస్టిఫికేషన్ జరిగేది. క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరూ ఊహించలేరు.. అని చిత్రబృందం బల్ల గుద్ది మరీ చెప్పింది. కానీ హంతకుడు ఎవరన్న ఆసక్తి… కథలో ఎక్కడా రాదు. ఆ ఫోన్ దొరికిందా? ఎవరు దొంగిలించారు? ఆ ఫోన్ లో ఏముంది? అనేదే ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్. తీరా చూస్తే.. ఫోన్ కథ వేరు, బ్యాంకు కథ వేరు అయిపోయింది. దాంతో.. ఎత్తుకొన్న పాయింట్ మధ్యలో వదిలేసిన ఫీలింగ్ కలుగుతుంది.
స్వాతిముత్యంతో ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ గణేష్. ఆ సినిమాలో పాత్రకు, టైటిల్ కు తగిన నటన కనబరిచాడు. దాంతో పోలిస్తే… ఈ సినిమాలో నటుడిగా ఇంకాస్త మెరుగయ్యాడు. ప్రారంభంలో `స్వాతిముత్యం`ని ఫాలో అవుతున్నాడని అనిపించినా, క్రమంగా.. వేరియేషన్స్ చూపించే అవకాశం దక్కింది. అవంతిక మిస్ మ్యాచ్ అయ్యింది. తన నటన కూడా చాలా పేవలవంగా ఉంది. సముద్రఖని.. ఈ సినిమాని కాస్త నిలబెట్టాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకొంది. కొన్ని క్యారెక్టర్లకు నటీనటుల్ని ఎంచుకోవడం రాంగ్ ఛాయిస్ అనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ గ్యాంగ్. జబద్దస్త్ రాంప్రసాద్ ని ఇలాంటి పాత్రల్లో ఊహించలేం. బహుశా చిత్రబృందం ఇదే కొత్తగా ఫీల్ అయ్యిందేమో..?
దర్శకుడు రాఖీ ఉప్పలపాటికి ఇదే తొలి సినిమా. ఈ కథ తనది కాదు. కానీ.. ఓన్ చేసుకోగలిగాడు. ఉన్నంతలో నీట్ గా తీశాడు. పాయింట్ చిన్నదే అయినా – అక్కడక్కడ తన పనితనం కనిపించింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ బాగా డీల్ చేశాడు. బడ్జెట్ పరిమితులు ఉన్నా.. క్వాలిటీ మేకింగ్ కనిపించింది. పాటలకు స్కోప్ తక్కువ. అనవసరంగా వాటిని ఇరికించే ప్రయత్నం కూడా చేయలేదు. మహతి స్వర సాగర్ అందించిన నేపథ్య సంగీతం రేసీగానే ఉంది. కథనం విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త తీసుకొని, అన్ ఆర్థరైజ్డ్ బ్యాంక్ ఎకౌంట్స్ అనే పాయింట్ పై కసరత్తు చేసి, సెల్ ఫోన్కీ, ఈ బ్యాంక్ స్కామ్‌కీ సరైన లింకు పెట్టుకొంటే – కచ్చితంగా ఈ సినిమా ఓ స్థాయిలో నిలిచేది. స్క్రీన్ ప్లే లోపాలు, చిన్న పాయింట్ కావడం వల్ల..ఆ ప్రయత్నం సగంలోనే ఆగిపోయింది.
తెలుగు360 రేటింగ్: 2.5/5