ఇంటిని చూసి ఇల్లాలు ఎటువంటిదో చెప్పవచ్చనట్లు భారత విదేశీ విధానం ఎంత గొప్పగా ఉందో తెలుసుకోవాలంటే, ఇరుగుపొరుగు దేశాలు దానితో ఏవిధంగా వ్యవహరిస్తున్నాయో చూస్తే అర్ధం అవుతుంది. చైనా, పాకిస్తాన్ దేశాల గురించి కొత్తగా చెప్పుకోవలసిందేమీ లేదు. భారత్ తో వాటి సంబంధాలు మొదటి నుంచి కూడా అంతంత మాత్రమే. బంగ్లాదేశ్ తో ఈ మధ్యనే కొంచెం సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి కానీ అవెంత కాలం నిలకడగా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఇంక మన దేశంలో ఒక చిన్న రాష్ట్రం అంత కూడా ఉండని శ్రీలంక, తరచూ మన తమిళ జాలర్లపై కాల్పులు జరపడమో లేదా వారిని అరెస్ట్ చేసి జైల్లో వేయడమో చూస్తూనే ఉన్నాము. అంతకంటే చిన్న దేశమయిన నేపాల్ కి కూడా భారత్ అంటే విద్వేషమే. ఎందుకంటే దాని అంతర్గత వ్యవహారాలలో అనవసరంగా వేలు పెడుతోందని! విశేషం ఏమిటంటే ఒక్క చైనాకి తప్ప ఈ దేశాలన్నిటికీ భారత్ ఎప్పటి నుంచో యధాశాక్తిన సహాయసహకారాలు అందిస్తూనే ఉంది. అయినా వాటికి భారత్ అంటే అసహ్యం, అలుసు. అవి భారత్ కంటే చైనాతోనే మంచి స్నేహంగా ఉంటాయి. అందుకు ఎవరిని నిందించాలి?
ఇంక అసలు విషయం ఏమిటంటే, నేపాల్ దేశాధ్యక్షురాలు విద్యాదేవి మే9 నుంచి ఐదు రోజుల పాటు భారత్ లో పర్యటించవలసి ఉంది. కానీ అకస్మాత్తుగా ఆమె పర్యటన రద్దయింది. కారణాలు చెప్పలేదు. అడిగినందుకు నేపాల్ లోని భారత్ రాయబారి దీప్ కుమార్ ఉపాథ్యాయను తన పదవిలో నుంచి తప్పుకోమని నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలి మొహమాటం లేకుండా చెప్పేశారు. అంతే కాదు తక్షణమే ఉపాద్యాయని వెనక్కి తీసుకోవలసిందిగా కోరుతూ మంత్రివర్గం చేత ఒక తీర్మానం చేసి చేతిలో పెట్టారు. దీప్ కుమార్ ఉపాథ్యాయ తన పరిధులు అతిక్రమించి నేపాల్ వ్యవహారాలలో వేలు పెడుతున్నారనేది ఆరోపణ. కానీ అసలు కారణం వేరే ఉంది.
కొన్ని నెలల క్రితం భారత్-నేపాల్ మధ్య కొంచెం ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు భారత్ నుంచి నేపాల్ కి నిత్యావసర సరుకులు, ఆహార సామాగ్రి నిలిపివేయడం జరిగింది. దానికి దీప్ కుమార్ ఉపాథ్యాయే కారణమని నేపాల్ ప్రభుత్వం అభిప్రాయ పడుతోంది. భారత్ నుండి నిత్యావసర సరుకుల సరఫరా నిలిపివేయగానే, నేపాల్ కి దగ్గర కావడానికి దానిని ఒక మంచి అవకాశంగా భావించిన చైనా సుమారు 3,000 ట్రక్కులలో నేపాల్ కి అవసరమయిన వస్తువులు అన్నీ పంపి ఆదుకొంది. చైనా అందించిన ఆ చిన్న సహాయంతో దశాబ్దాలుగా భారత్ అందిస్తున్న సహాయం దిగదుడుపే అయిపోయింది. అప్పటి నుంచే నేపాల్ చైనాకి దగ్గరవడం మొదలుపెట్టింది. అయితే ఆ తరువాత భారత్-నేపాల్ సంబంధాలు మళ్ళీ గాడిన పడటంతో ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భారత్ పర్యటన ఖరారయింది. మళ్ళీ అంతలోనే ఆమె పర్యటన ఎందుకు రద్దు చేసుకోవలసి వచ్చిందో తెలియదు కానీ ఎటువంటి కారణాలు చెప్పకుండా పర్యటన రద్దు చేసుకోవడం, కారణాలు అడిగినందుకు రాయబారిని వెనక్కి త్రిప్పి పంపించడం దౌత్యపరంగా చాలా పెద్ద తప్పులే. ఒక దేశంతో మరొక దేశం సంబంధాలు వద్దనుకొన్నపుడే ఆవిధంగా వ్యవహరిస్తుంటాయి. బహుశః నేపాల్ కూడా భారత్ తో సంబంధాలు వద్దనుకొంటోందేమో? లేదా భారత్ కి దూరంగా ఉండమని చైనా హెచ్చరించి ఉండవచ్చు. ఇరుగు పొరుగు దేశాలను మంచి చేసుకొనే ప్రయత్నంలో వాటి పట్ల భారత్ అతి ఉదారంగా వ్యవహరిస్తుండటం వలననే ఇటువంటి పరిస్థితులు తరచూ ఎదురవుతుంటాయని చెప్పవచ్చు.