వారసత్వ రాజకీయాలే దేశానికి పట్టిన దరిద్రం అని బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటుంది కానీ… ఆ మాటలు కేవలం గాంధీలు లేకపోతే తమకు వ్యతిరేకంగా ఉన్న చంద్రబాబు, కేసీఆర్ వంటి కుటుంబాలకే పరిమితం. తమ పార్టీకి బాగా సేవలందించిన వారు ఎవరి వారసులైనా సరై రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. లెక్క తీస్తే ప్రతీ రాష్ట్రంలోనూ సీనియర్ నేతల పుత్రులు.. పుత్రికా రత్నాలు రాజకీయాల్లో ఉన్నారు. చివరికి అమిత్ షా కుమారుడు .. సరిగ్గా చూసి చదవడం కూడా రాని జే షా బీసీసీఐని ఒంటి చేత్తో నడిపించేస్తున్నారు.
అందుకే తమ పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అయినా సరే సీనియర్ నేతలు వారసుగా పరిచయం చేసేందుకు ఉబలాటపడుతున్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఇప్పటికే తన భార్యను రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కిషన్ రెడ్డి పోటీ చేయడం ఖాయం.. ఎమ్మెల్యేగా అంబపేట నుంచి తన భార్యను పోటీ చేయించాలనుకుంటున్నారు. అందుకే ఆమె ఇటీవల నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా తన కుమార్తె విజయలక్ష్మిని రాజకీయాల్లో యాక్టివ్ చేయాలనుకుటున్నారు.
తను ప్రతీ ఏడాది దసరా తర్వాతి రోజు నిర్వహించి అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈసారి తన కుమార్తె చేతుల మీదుగానే నిర్వహింప చేశారు. ఆ సమావేశంలో తాను రాజకీయాల్లోకి వస్తానని .. బీజేపీ హైకమాండ్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ్నుంచి పోటీ చేస్తానని విజయలక్ష్మి ప్రకటించారు. దత్తాత్రేయ లాంటి సీనియర్.. పార్టీ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన నేత అడిగితే బీజేపీ కాదంటుందా ?. వారసులు అనే నిబంధన… ఇతర పార్టీలకే పరిమితం కాబట్టి.. చాన్సిచ్చేయడం ఖాయమని అనుకోవచ్చు.