ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1968 వరకూ జీవించే ఉన్నారని ఓ డాక్యుమెంట్ వెల్లడించింది. నేతాజీకి సంబంధించిన రహస్య ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. అందులో భాగంగా గురువారం విడుదల చేసిన ఫైళ్లను పరిశీలించగా ఈ విషయం బయటపడింది.
స్వాతంత్ర్యానికి ముందే విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారనే వాదన తప్పని రుజువు చేస్తూ ఓ ఫైల్ నమ్మలేని నిజాన్ని వెల్లడించింది. నేతాజీ ఎప్పటి వరకూ జీవించి ఉన్నారో తెలియదు గానీ కనీసం 1968 వరకూ రష్యాలో రహస్య జీవితం గడిపారట.
భారతీయ సంతతికి చెందిన రచయిత, జర్నలిస్టు నరేంద్ర నాథ్ సిందక్దర్ 2000 సంవత్సరంలో ముఖర్జీ కమిషన్ కు ఒక అఫిడవిట్ సమర్పించారు. ఆయన 1966 నుంచి 1991 వరకు రష్యాలో ఉన్నారు. రష్యాలో సైబీరియా ప్రాంతంలోని ఒక పట్టణంలో నేతాజీ ఉండేవారు. విప్లవకారుడు వీరేంద్ర నాథ్ ఛటోపాధ్యాయ్ కుమారుడు నిఖిల్ ఛటోపాధ్యాయ నేతాజీని 1968లో కలుసుకున్నారని అఫిడవిట్ లో తెలిపారు.
భారత దేశంలోని ఆనాటి నెహ్రూ ప్రభుత్వం తనను యుద్ధ ఖైదీగా విచారిస్తుందేమో అనే అనుమానంతో నేతాజీ రష్యాలో రహస్య జీవితం గడిపాడని కూడా ఆ ఫైలు చెప్తోంది. ఇదే నిజమైతే, విమాన ప్రమాదంలో బోస్ మరణించారనేది అబద్ధమే అవుతుంది. అలాగే, గుమ్నామీ బాబా పేరు మీద అయోధ్య ప్రాంతంలో జీవించిన బాబా నిజానికి నేతాజీయే అనేది కూడా వట్టి ప్రచారమే అని అర్థమవుతుంది. తొలి ప్రధాని నెహ్రూకు నేతాజీపై సదభిప్రాయం ఉండేది కాదని, అందుకే బోస్ భారత్ కు తిరిగి రావడానికి ఇష్టపడలేదని ఇప్పటి వరకూ చాలా మంది వాదించారు. అదే నిజమంటూ తాజాగా ఓ ఫైల్ లోని అఫిడవిట్ ఓ కొత్త విషయాన్ని తెరపైకి తెచ్చింది.