ఓటీటీ మార్కెట్ పడిపోయిందని చాలామంది నిర్మాతలు దిగాలు పడిపోతున్నారు. అయితే ఇంత క్లిష్టమైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవల ‘తండేల్’ రూ.40 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు మరో మీడియం రేంజ్ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’కి కూడా మంచి డీల్ కుదిరింది. ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ రూ.14 కోట్లకు కైవసం చేసుకొంది.
విశ్వక్సేన్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన సినిమా ఇది. కృష్ణ చైతన్య దర్శకుడు. మే 17న విడుదల కానుంది. ఇటీవల టీజర్ కూడా విడుదలైంది. అది ప్రామిసింగ్ గా అనిపించింది. విశ్వక్ మాస్ అవతార్ ఫ్యాన్స్‌కు నచ్చింది. పైగా ఇప్పటి వరకూ విడుదల చేసిన పాటలు కూడా క్లిక్ అయ్యాయి. సితార సంస్థకు మంచి ఇమేజ్ ఉంది. ఇవన్నీ ఓటీటీ మార్కెట్ క్లియరెన్స్ కు దోహదం చేశాయి. ఇప్పుడు శాటిలైట్ డీల్ జరుగుతోంది. ఇది కూడా వారం రోజుల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. శాటిలైట్ కూడా అయిపోతే.. విడుదలకు ముందే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సేఫ్ జోన్లో పడిపోతుంది.