ఆంథాలజీలకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్, అమేజాన్ లాంటి ఓటీటీ సంస్థలు అంథాలజీల వైపు దృష్టి పెడుతున్నాయి. తాజాగా తెలుగులో మరో ఆంథాలజీ వస్తోంది. అదే.. `పిట్టకథలు`. నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందించిన ఈ పిట్ట కథలకు.. నాగ అశ్విన్, తరుణ్ భాస్కర్, నందినిరెడ్డి, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఒకొక్కరూ.. ఒక్కో కథని తెరకెక్కించారు. ఈ నాలుగు కథల సమాహారమే.. `పిట్ట కథలు`. ఫిబ్రవరి 19న ఈ పిట్టకథల్ని నెట్ ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కథ `రాముల`. ఇందులో మంచు లక్ష్మి ప్రధాన పాత్రధారి. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన కథ `మీరా.` ఇందులో జగపతిబాబు, అమలాపాల్ నటించారు. నాగ అశ్విన్ `ఎక్స్ లైఫ్` అనే కథని తెరకెక్కించారు. ఇందులో శ్రుతిహాసన్ ప్రధాన పాత్రధారి. `పింకీ` అనే కథకు సంకల్ప్ రెడ్డి దర్శకుడు. ఇందులో సత్యదేవ్, ఈషా రెబ్బా జంటగా నటించారు.