బిజెపి నేత విజయ శాంతి ట్విట్టర్ వేదిక గా అధికార టీఆర్ఎస్ పార్టీ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బిజెపి లో చేరడాని కి ముందు కాంగ్రెస్ నాయకురాలి గా ఉన్న సమయంలో కూడా ఇదే విధం గా ట్వీట్ల తో టి ఆర్ ఎస్ పై విమర్శలు చేసే వారు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేసిన సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విజయశాంతి మరొక సారి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డప్పటికీ ఈసారి నెటిజన్లు విజయశాంతిని ట్విట్టర్ దాటి బయటకు వచ్చి నిజమైన కార్యక్రమాలు, నిజమైన పోరాటాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు . వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో కరోనా కేసులు తగ్గాయని రిపోర్టులు చూపిస్తూ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేసిన సంగతి తెలిసిందే. నిన్నటి నుండి అన్ని కార్యక్రమాలు యధావిధి గా తెలంగాణలో మొదలైపోయాయి. అయితే దీనిపై విజయ శాంతి విమర్శలు చేశారు. ఆవిడ ట్వీట్ చేస్తూ.. ” తెలంగాణ ప్రజలంటే శుద్ధ అమాయకులని, ఇట్టే మోసం చెయ్యవచ్చనేది సీఎం కేసీఆర్ గారి గట్టి విశ్వాసం. నిన్నటి వరకూ కరోనా పేరిట పగలు కొన్ని గంటల పాటు, రాత్రి మొత్తం లాక్ డౌన్ పెట్టి… చివరికి పాజిటివ్ రేటు తగ్గిపోయిందంటూ కరోనా కట్టడి కి ఎలాంటి చర్యలూ ప్రకటించకుండానే ఉన్నట్టుండి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశారు. అంతేనా… లాక్ డౌన్ ఎత్తేసిన రోజునే జిల్లాల్లో పర్యటనలు, ప్రారంభోత్సవాలు మొదలుపెట్టారు. తన దత్తత గ్రామం లో వేలాది మంది తో సామూహిక భోజనాలకు కూడా ప్లాన్ వేశారు. ఇదంతా చూస్తుంటే కరోనా తగ్గి పోయిందని ఈ కార్యక్రమాలు పెట్టారో… లేక ఈ మొత్తం ప్రోగ్రాం కోసం తెలంగాణ లో కరోనా తగ్గిపోయిందని తప్పుడు నివేదికలు తెప్పించి లాక్ డౌన్ ఎత్తేశారో… ప్రజలు ఆ మాత్రం గ్రహించలేని వెర్రి వాళ్ళు కాదు. ఇది చాలక పేరెంట్స్ వద్దని వేడుకుంటున్నా వినకుండా జులై నుంచి విద్యా సంస్థల్ని తెరిచేందుకు కూడా అనుమతులిచ్చేసి విద్యార్థుల ప్రాణాల్ని పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఒక వైపు మన పక్క రాష్ట్రాల్లో ఇంకా కఠిన నిబంధన ల మధ్య లాక్డౌన్లు నడుస్తున్నాయి. పొరుగునున్న మహారాష్ట్ర లో కొవిడ్ డెల్టా ప్లస్ వేరియంట్ ప్రజల్ని భయపెడుతోంది. తమిళనాడు లో మరో పది రోజులు లాక్ డౌన్ పొడిగించారు. కర్ణాటక లోనూ దాదాపు ఇవే పరిస్థితులు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని తెలంగాణ పాలకులు కేవలం తమ ప్రయోజనాల కోసం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేందుకు సిద్ధపడ్డారు. ఇలాంటి సర్కారు బారిన పడినందుకు రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందని రోజు లేదనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ” అని రాసుకొచ్చారు.
అయితే నెటిజన్ల నుండి విజయశాంతి వ్యాఖ్యల కు మిశ్రమ స్పందన వస్తోంది. మేడం గారు ముందు మీరు ట్విట్టర్ దాటి బయటకు వచ్చి నిజమైన పోరాటాలు చేయండి అంటూ ఆవిడ అభిమానులే ఆవిడ కి విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం గతంలో ఆరోగ్య శాఖ మంత్రి గా పనిచేసిన ఈటెల రాజేందర్ లాంటి వారే ఇటీవల బిజెపిలో చేరి ర్యాలీ లు చేస్తున్నారని, మరి ఇవి విజయశాంతికి ఎందుకు కనపడవని ప్రశ్నించారు.
ఏది ఏమైనా ట్విట్టర్ వెనకాల దాక్కొని రాజకీయాలు చేసినంత కాలం ఏ రాజకీయ నాయకుడికి కూడా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. విజయ శాంతి కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. గతంలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి వారి విషయంలో కూడా ఇదే తరహా విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత వారు కొంత వరకు ఆ ముద్ర ను చెరిపేసుకోగలిగారు. మరి విజయశాంతి భవిష్యత్తులో అయినా ప్రజా పోరాటాల లోకి వస్తారా లేకపోతే తాను లేడీ సూపర్ స్టార్ ని అని, ఇంట్లో కూర్చుని తాను ట్విట్టర్ లో ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది అని భావించి సోషల్ మీడియా లో మాత్రమే పోరాటాలు చేస్తారా అన్నది వేచి చూడాలి.