సోషల్ మీడియాలో మునిగి తేలే వాళ్లకి మంచి, చెడూ కూడా తెలియనందగా మెదడు మొద్దుబారిపోతోంది. ఎవరైనా ఓ ప్రముఖ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే.. కామెడీలు.. వెటకారాలు చేస్తూ.. కామెంట్లుతో చెలరేగిపోతున్నారు. నిన్నటికి నిన్న నిర్మాత బండ్ల గణేష్.. ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ల విషయంలో… నెటిజన్ల పేరుతో… కొంత మంది తమ వికారాన్ని ప్రదర్శించడం కాస్త తెలివి ఉనన వాళ్లను సైతం నివ్వెర పరుస్తోంది. మనిషి ప్రాణానికి కనీస విలువ లేనట్లుగా.. వారు పెడుతున్న కామెంట్లపై విస్మయం వ్యక్తం అవుతోంది.
బండ్ల గణేష్.. సినిమాల్లో కమెడియన్ వేషాలే వేయవచ్చు. బయట కూడా ఆయన కామెడీగానే మాట్లాడవచ్చు. కానీ ఆయనది కూడా ప్రాణమే. కరోనా పాజిటివ్ వచ్చిందనే సమాచారం బయటకు తెలియగానే… దారణమైన కామెంట్లతో కొంత మంది తమకు.. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన వాక్ స్వేచ్చను ప్రదర్శించారు. ఆయనది ప్రాణం కాదన్నట్లుగా కామెడీ చేశారు. కాస్త కామెడీ టచ్లో రాజకీయాలు చేసే.. వీహెచ్ కు తాజాగా కరోనా పాజిటివ్ అని తెలియడంతో.. కూడా అలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ కు మంచి రోజులు వచ్చినట్లేనని.. కొందరు సెటైర్లు కూడా వేయడం ప్రారంభించారు.
సినిమాలు, రాజకీయాలు.. అన్నీ.. వృత్తి, ప్రవృత్తి పరంగా ఎవరికి వారు చేసుకుంటూ ఉంటారు. అందులో వారు చేసే పనులను బట్టి.. వారిని వ్యక్తిగతంగా ద్వేషించడం.. వారిని చులకన చేయడం.. ఏ మాత్రం విజ్ఞత అనిపించుకోదు. కాస్త చదవుకున్న వారికి.. లోక జ్ఞానం తెలిసిన వారికి.. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ.. సోషల్ మీడియాలో పనీ పాటా లేకుండా నెటిజన్లుగా చెలామణి అవుతున్న వారు.. లక్షల మందికి ఈ జ్ఞానం ఇసుమంత కూడా లేదని.. అర్థమవుతోంది. వాళ్లను ఎవరూ ఎడ్యుకేట్ చేయలేరు.