‘సరైనోడు’ సినిమాకు సీక్వెలా?
‘జయ జానకి నాయక’ ప్రీక్వెలా?
‘వినయ విధేయ రామ’ టీజర్ విడుదలైన తరవాత నెట్టింట్లో జనాలు ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ముఖ్యంగా దర్శకుడు బోయపాటి శ్రీనుని ఓ ఆట ఆడుకుంటున్నారు. తన గత చిత్రాలతో పోలిస్తే బోయపాటి కొంచెం కూడా కొత్తదనం చూపించలేదని విమర్శిస్తున్నారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్… షాట్ టు షాట్… పాత సినిమాలతో పోలుస్తూ బాదుడు మొదలెట్టారు. బహుశా… ఇటీవల ఒక సినిమా టీజర్ విడుదలైన తరవాత దర్శకుడి మీద ఈ స్థాయిలో విమర్శలు రావడం ఇదే తొలిసారి! ‘జయ జానకి నాయక’ హంసలదీవి యాక్షన్ ఎపిసోడ్ హ్యాంగోవర్ నుంచి బోయపాటి బయటకు వచ్చినట్టు లేరనే సెటైర్ ఎక్కువ వినిపిస్తోంది. హీరోతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కలసికట్టుగా రావడం, విలన్ రౌడీ బ్యాచ్ అందరికీ బ్లాక్ డ్రస్ కోడ్ పెట్టడం వంటి అంశాలను వేలెత్తి చూపిస్తున్నారు నెటిజన్లు. ‘సరైనోడు’లో టెంపుల్ ఫైట్ సూపర్‌హిట్. లేటెస్టుగా వచ్చిన ‘వినయ విధేయ రామ’ టీజర్ చూస్తే… మొహరం నేపథ్యంలో ఒక ఫైట్ డిజైన్ చేసినట్టు వుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో టెంప్లేట్ ఫార్ములాకు బోయపాటి కట్టుబడి సినిమాలు తీస్తున్నట్టు వున్నాడని దర్శకుడిపై విమర్శల బాణాల్ని వదులుతున్నారు. ఇవన్నీ న్యూట్రల్ ఆడియన్స్ నుంచే. వాళ్లు రామ్ చరణ్ లుక్‌ని కూడా విమర్శిస్తున్నారు. అంతకు ముందు సినిమాల్లో చూసినట్టు వుందని! మెగా అభిమానులకు ‘రామ్ కొ… ణి… దె… ల’ వంటి డైలాగులు నచ్చాయి. సినిమా విడుదల తరవాత పరిస్థితి ఎలా వుంటుందో చూడాలి!