సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే కొంతమంది జీవులు రోజు రోజుకూ దిగజారిపోతున్నారు. ఇంటర్నెట్లో ఉండే బూతు పుస్తకాలు చదవడమే పనిగా పెట్టుకుంటున్నారో, లేక చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు విద్యనేర్పిన గురువులతో పాటు, పెరిగిన పరిసరాలన్నీ కూడా కేవలం బూతు పంచాంగాల గురించే వాళ్ళకు తర్ఫీదునిచ్చారో ఏమో తెలియదు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా, ఏ ప్రాంతంలోనూ, ఏ మనుషుల మధ్య కూడా ప్రస్తావనలో కూడా లేకుండాపోయిన బూతులన్నీ ఈ బూతు జనాల ఫేక్ అకౌంట్స్‌లో కనిపిస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్స్ కూడా ఇలా పరస్పరం తిట్టుకుంటున్న వాళ్ళను బాగా ఎంకరేజ్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నాయి.
ఈ తిట్టుకునేవాళ్ళ సంస్కారం స్థాయి ఏంటి అనేది వాళ్ళ కామెంట్స్‌లోనే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి మనుషుల్లా మాట్లాడుకోవడం మానేసి దెయ్యాల్లా తిట్టుకుంటూ పోట్లాడుకోవడం అవసరమా? అని వీళ్ళకు చెప్పడం వేస్ట్. కానీ కులం, మతం, ప్రాంతం, పార్టీ, నాయకులు, సినిమా హీరోలపైన ఉండే మూర్ఖపు అభిమానంతో అన్ని విషయాలపైనా బూతుల వర్షం కురిపిస్తున్నవాళ్ళందరూ కూడా కనీసం కొన్ని విషయాలకు మినహాయింపు ఇస్తే బాగుంటుంది అని తెలుసుకుంటే మంచిది. మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఎన్టీఆర్‌ల మరణం గురించి బూతులు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎన్టీఆర్, వైఎస్‌ల పాలన గురించి, పథకాలు, నాయకత్వ శైలి గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళిద్దరి మరణం గురించి చెడుగా మాట్లాడడం మాత్రం మానవత్వం అనిపించుకోదు. ఇప్పుడు ఫేక్ అకౌంట్స్‌లో మీరు పేలినంత మాత్రాన ఎన్టీఆర్, వైఎస్‌లకు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ మీ ఆలోచనల స్థాయి మాత్రం మృగాల కంటే దిగజారుతోంది. అది మీ జీవితంపైన చాలా ప్రభావం చూపిస్తుంది. మీ ఆలోచనలన్నీ కూడా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. నా ఐడెంటిటీ తెలియట్లేదు కదా అని చెప్పి మీలో ఉన్న మృగాన్ని మీరే రెచ్చగొడుతున్నారు కానీ, ఆ తర్వాత ఆ దిగజారుడు ఆలోచనలన్నీ కూడా మీలో ఉన్న మనిషిని చంపేస్తాయి. ఎన్టీఆర్, వైఎస్‌ల మరణం గురించి కఠినంగా మాట్లాడి ఎవరినో బాధపెడదామన్న ప్రయత్నంలో మనిషిగా మీరు చచ్చిపోతున్నారేమో ఒకసారి ఆలోచించుకుంటే మీకే మంచిది.