మైకు పట్టుకొంటే చాలు. అందరూ నీతులు చెప్పేవాళ్లే. చదివేవాడు ఉంటే, సోషల్ మీడియా నిండా సుభాషితాలు రాసుకొంటూ పోవొచ్చు. వినేవాడు ఉంటే – వేమన కంటే గొప్పగా నీతులు వల్లించొచ్చు. కానీ పాటించేటప్పటికి వస్తేనే బిక్క మొహం వేయాల్సివస్తుంది. నీతులు ఉన్నవి చెప్పేటందుకే అన్నది అలీలాంటి వాళ్లని చూస్తే అర్థమవుతుంటుంది. అలీ గొప్ప వక్త కాకపోవొచ్చు. కానీ ఓ సెలబ్రెటీ. తను ఏం చెప్పినా వినడానికి జనాలు రెడీగా ఉంటారు. నటుడిగానే కాదు, బుల్లి తెర వ్యాఖ్యాతగానూ తన మనోభావాలు, అభిప్రాయాలూ పంచుకోవడానికి కావల్సినంత స్పేస్ ఉంది. `అలీతో సరదాగా` టైమ్ లో అలీ శివాజీని ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఆ సమయంలో బెట్టింగుల జోలికి పోవొద్దని, జీవితాలు నాశనం చేసుకోవొద్దని, డబ్బులు సంపాదించకపోయినా ఫర్వాలేదు కానీ, ఇలా ఈజీ మనీ కోసం ఆశ పడొద్దని సుద్దులు చెప్పాడు. అయితే ఇప్పుడు అదే అలీ.. ఓ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకొంటున్నాడు. దాంతో అలీ గతంలో `అలీతో సరదాగా` సమయంలో చేసిన కామెంట్స్ మళ్లీ బయటకు లాగారు నెటిజన్లు. `నువ్వు చెప్పిందేమిటి, చేస్తోందేమిటి` అంటూ సోషల్ మీడియా సాక్షిగా నిలదీస్తున్నారు. బెట్టింగుల పేరుతో యువకులు తమ జీవితాల్ని నాశనం చేసుకొంటున్నారని, ఆ పాపంలో అలీ లాంటి వాళ్లకూ వాటా ఉందని ఘాటుగానే విమర్శిస్తున్నారు.
అలీ అనే కాదు. చాలామంది సెలబ్రెటీలు ఇలాంటి యాప్‌లకు ప్రచార కర్తలుగా వ్యవహరించడం ప్రమాదకరమైన సంకేతాల్ని ఇస్తోంది. సెలబ్రెటీలదేముంది? డబ్బుల కోసం ఏమైనా చెబుతారు. కానీ వాళ్ల మాయలో పడే యువత జీవితాలే ప్రమాదపు అంచున ఊరేగుతాయి. ప్రేక్షకులే దేవుళ్లంటూ వాళ్ల ఆశీస్సులే అన్నపానియాలంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే సెలబ్రెటీలు, వాళ్లని చెడు వ్యసనాల వైపు నడిపించడంలో ప్రత్యక్షంగా, పరోక్షంంగా కారణమవ్వడం దారుణాతి దారుణం. యాడ్లే చేసుకోవాలి, తద్వారా డబ్బులు సంపాదించుకోవాలంటే చాలా మార్గాలుంటాయి. ఇలాంటి యాప్‌లకు మాత్రం వాళ్లు దూరంగా ఉండాలి. యువతనీ దూరంగా ఉంచాలి. అలీ లాంటి వాళ్లు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవడం మంచిది.