మొన్న హిందూ ధర్మం గురించీ, సనాతన సంప్రదాయం గురించి, దాన్ని తెలుగు సినిమాల్లో ఖూనీ చేస్తున్న విధానం గురించి గొప్పగా లెక్చర్లు దించి కొట్టాడు గీత రచయిత అనంత శ్రీరామ్. ముఖ్యంగా ‘కల్కి’లో కర్ణుడ్ని చూపించిన విధానంపై ఘాటైన విమర్శలు చేశాడు. ఓ సినిమా వాడిగా సిగ్గు పడుతున్నానని, బాధతో మాట్లాడుతున్నానని కడివెడు ఎమోషన్ గుమ్మరించాడు.
అనంత శ్రీరామ్ స్పీచ్ చాలామందికి నచ్చలేదు. సినిమావాడై ఉండి, సినిమా పరిశ్రమపై రాళ్లు రువ్వడం ఎవరూ హర్షించలేదు. కొంతమంది సనాతన వాదులు అనంత శ్రీరామ్ ని అక్కున చేర్చుకొన్నారు. అది కామన్ కూడా. అయితే ఇప్పుడు అనంత శ్రీరామ్ పాత లెక్కలన్నీ బయటకు తీసే పనిలో పడ్డారు సోషల్ మీడియా జనాలు. సనాతన ధర్మం గురించీ, సంప్రదాయాల గురించీ గొప్పగా మాట్లాడే అనంత శ్రీరామ్ ఇది వరకు ఎలాంటి పాటలు రాశాడో, అందులో సనాతన ధర్మం ఎంత ఖూనీ అయ్యిందో వివరించి మరీ చెబుతున్నారు
‘యమ దొంగ’లో అనంత శ్రీరామ్ ‘యంగ్.. యమా.. యంగ్ యమా’ అనే ఓ పాట రాశాడు. అందులోని సాహిత్యం, అక్కడ కనిపించే భక్తి విలువలు (?) ఇవన్నీ బయటపెడుతున్నారు.
”యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో
కుర్ర యమా కుర్ర యమా కుమ్మేసుకో
తుమ్మెదెలే అమృతమే జుర్రేసుకో
యమ పోటుగా కోటనే దున్నేసుకో….” అంటూ యమలోకం సాక్షిగా దాదాపుగా ఓ బూతు పాట రాశాడని, యముడికీ పురాణాలతో గొప్ప స్థానం ఉందని, యమలోకాన్ని, యముడ్నీ అపహాస్యం చేసేలా పాట రాయడం ఏమిటని? ఇది హిందూత్వాన్ని, హిందూ సంప్రదాయాల్నీ కించపరచడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇదొక్కటే కాదు. అనంత శ్రీరామ్ ఇది వరకు రాసిన పాటలు, అందులోని సాహిత్యపు విలువలూ.. ఇప్పుడు ఒకొక్కటిగా బయటకు తీస్తున్నారు. దీనిపై అనంత శ్రీరామ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. పాటని పాటగానే చూడమంటూ రొటీన్ సమాధానం చెబితే ‘సినిమాని సినిమాగా నువ్వెందుకు చూడవు’ అనే ఎదురు ప్రశ్న క్షణం ఆలస్యం కాకుండా సంధించడానికి సినీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. అందుకే అనంత శ్రీరామ్ ఏం మాట్లాడినా కాస్త ఆచి తూచి మాట్లాడాల్సిందే.