బడ్జెట్ షరా మామూలుగానే ఆంధ్రప్రదేశ్ కు మొండిచేయి చూపింది. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దీనిపై నోరు మెదపడం కూడా చేయలేదు. మరోపక్క సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే విజయసాయిరెడ్డి మాత్రం ట్విట్టర్ లో తాను బడ్జెట్ పై స్పందిస్తూ ఢిల్లీలో మాట్లాడిన ఒక వీడియోని తూతూమంత్రంగా పోస్ట్ చేసి వదిలేశారు. విజయ సాయి రెడ్డి తీరుపై నెటిజన్ల సెటైర్లు వేశారు. వివరాల్లోకి వెళితే..
అక్రమాస్తుల కేసులో ఏ1 గా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉంటే, ఏ2 గా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్న విషయం తెలిసిందే. కేసులలో చిక్కుకున్న కారణంగా వీరు కేంద్ర ప్రభుత్వం పై నోరు మెదప డానికి కూడా సంశయిస్తూ ఉంటారు. అయితే మరీ నోరు మెదపకుండా ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలకు చులకన అయిపోతుంది కాబట్టి తూతూమంత్రంగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఈరోజు బడ్జెట్ లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు మొండిచేయి చూపడం పై ఢిల్లీలో ఆయన స్పీచ్ ఇచ్చారు. అది కూడా తెలుగులో. వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వవలసిన గ్రాంట్ల ప్రస్తావన ఈ బడ్జెట్లో లేదని, అలాగే రాష్ట్రానికి రావాల్సిన 2100 కోట్ల ప్రస్తావన లేదని, వీటన్నింటిపై తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారని ఆయన ఆ వీడియోలో అన్నారు. అయితే, నిజంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద విమర్శించాలి అనుకుంటే, ట్విట్టర్లో కేవలం ఒక వీడియో ని, అది కూడా తెలుగులో మాట్లాడిన వీడియో ని పోస్ట్ చేయడం మాత్రమే కాకుండా, కేంద్ర ప్రజలకు అర్థమయ్యేలా ఇంగ్లీషులో, బిజెపి బడ్జెట్ ని విమర్శిస్తూ, బిజెపి పార్టీ ని, ఆర్థిక మంత్రిని, ప్రధానమంత్రి ని, ట్యాగ్ చేసి ట్వీట్ చేయాల్సింది అంటూ నెటిజన్లలో ఎద్దేవా చేశారు. బహుశా బడ్జెట్ ను విమర్శిస్తూ, కేంద్ర పెద్దలకు అర్థమయ్యేలా, అలా ఇంగ్లీషులో ట్వీట్ చేయడానికి విజయసాయిరెడ్డికి ధైర్యం సరిపోయినట్లు లేదు అంటూ వారు సెటైర్లు వేశారు.
మొత్తానికి అటు జగన్, బడ్జెట్ మీద నోరు మెదపకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉంటే, ఇటు విజయ సాయి మాత్రం వ్యూహాత్మకంగా ఇంగ్లీషులో ట్విట్ చేయకుండా, బిజెపి పెద్దలను ఎవరిని ట్యాగ్ చేయకుండా తమ పార్టీ కార్యకర్తల ని సంతృప్తిపరచడానికి తూతూమంత్రంగా వీడియో చేశాడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.