నిర్భయ కేసులో నిన్న విడుదలయిన బాల నేరస్థుడిని భారత్ మీడియా ఒక భూతంలాగ చూపుతోందని ఆ కేసు ఆధారంగా “ఇండియాస్ డాటర్” అనే డాక్యుమెంటరీ సినిమాను తీసిన బ్రిటన్ కి చెందిన లెస్లీ ఉడ్విన్ అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆమె ఈ సినిమా కోసం తీహార్ జైల్లో ఉన్న నిర్భయ దోషులందరినీ కలిసి ఇంటర్వ్యూ చేసి దాని ఆధారంగా సినిమా తీసారు. కనుక ఆమెకు ఈ కేసు విషయంలో సాధారణ ప్రజల కంటే ఎక్కువ అవగాహనే ఉంటుందని నమ్మవచ్చును. ఆమె “సిలోన్ టుడే” అనే పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో నిర్భయ కేసులో బాల నిందితుడి గురించి భారత్ మీడియా చెప్పని కొన్ని కొత్త విషయాల గురించి చెప్పారు.
“నేను ఆ కేసులో దోషులందరినీ కలిసి మాట్లాడినప్పుడు, ఈ బాల నేరస్తుడు ఒక్కడు తప్ప మిగిలిన వారిలో ఎటువంటి బాధ, పశ్చాతాపం నాకు కనబడలేదు. వారందరూ ఆ సంఘటనని చాలా తేలికగా తీసుకొన్నారు. వారిలో ఒకడు గతంలో వీదుల్లో అడుకొనే ఐదేళ్ళ పాపపై అత్యాచారం చేసాడు. దానిపై నేను అతనిని ప్రశ్నించగా అతను చెప్పిన జవాబు నన్ను షాక్ కి గురి చేసింది. రోడ్డు మీద అడ్డుకొనే ఆ పాప ప్రాణానికి ఎటువంటి విలువలేదని అన్నాడు. అంటే అతనిలో మానవత్వం ఏ కోశాన్న లేదని అర్ధమవుతోంది. కానీ బాలనేరస్తుడు మాత్రం తను చేసిన హేయమయిన నేరానికి చాలా పశ్చాతాపపడుతున్నట్లు గమనించాను. ఈ మూడేళ్ళలో అతను చదువుకొని విద్యావంతుడు అయ్యేడు. అలాగే ‘ప్రయాస్ బాలనేరస్థుల సంరక్షణా కేంద్రంలో అతను వంటపని, కుట్టుపని చాలా బాగా నేర్చుకొన్నాడు. కానీ తను అసహ్యించుకొంటున్న సమాజంలో ఏవిధంగా బ్రతకాలో తెలియక భయపడుతున్నాడు. భారత్ మీడియా అతనిని ఒక భయంకరమయిన భూతంలాగ చూపిస్తోంది. కానీ అది నిజం కాదు.”
“అతని కుటుంబం పేదరికంలో మగ్గుతున్నందున కుటుంబంలో ఎవరూ అతనిని పట్టించుకోలేదు. అతను ఇంటి నుంచి పారిపోయి డిల్లీ చేరుకొన్నాడు. ఆ తరువాత ఒకానొక రోజు ఈ హేయమయిన నేరానికి పాల్పడ్డాడు. బహుశః ఆ నేరానికి పాల్పడుతున్న పెద్దవారికి తాను ఏమాత్రం తీసిపోనని నిరూపించుకోవడానికే అతను ఆ నేరానికి పాల్పడినట్లు అర్ధమయింది. అయితే అందుకు అతను ఆ తరువాత చాలా పశ్చాతాపపడ్డాడు. అతని మానసిక ప్రవర్తన కూడా మెరుగుపడింది. కానీ ఇప్పుడు బయట ప్రపంచంలోకి రావడానికి చాలా భయపడుతున్నాడు. అతని పుట్టి పెరిగిన వాతావరణం అతనిపై తీవ్ర ప్రభావం చూపిందని నేను భావిస్తున్నాను. ఈకేసుపై విచారణ ఇంకా పూర్తి కావలసి ఉంది కనుక ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను,” అని ఆమె అన్నారు.
కానీ ఈ మూడేళ్ళలో అతనిలో నేర ప్రవృతి ఇంకా పెరిగిందని, అతను ఉగ్రవాదంపై ఆసక్తి పెంచుకొన్నాడని కేంద్ర నిఘా వర్గాలు డిల్లీ హైకోర్టు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ రెంటిలో ఏది నిజమో ఏది అబద్దమో ఈ మూడేళ్ళు అతనిని కనిపెట్టుకొని ఉన్న ప్రయాస్ సంరక్షణా కేంద్రం అధికారులకే తెలియాలి.