మేఘాలలో తేలిపోతూ… విమాన ప్రయాణం చేయాలనే కోరిక తీర్చుకోవాలని ఉందా? అయితే మీకో శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కొత్త ఏవియేషన్ పాలసీ, చాలా మందికి విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తుంది. విమాన ప్రయాణం అంటే అద్దంలో చందమామను చూసినట్టే అనుకునే రోజులు పోయాయి. సంపన్నులే కాదు మధ్య తరగతి వారూ హాయిగా ఆకాశయానం చేసే రోజులు వచ్చాయి.
కొత్త ఏవియేషన్ పాలసీ ప్రకారం, గంట విమాన ప్రయాణానికి అత్యధికంగా 2500 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. డిమాండ్ ఉంది కదా అని అడ్డగోలుగా చార్జీలు పెంచడం కుదరదు. అలాగే అరగంటలో ప్రయాణం ముగిస్తే గరిష్ట చార్జీ 1200 రూపాయలే. ప్రస్తుతం ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి నగరాలకు డిమాండ్ పెరిగేకొద్దీ చార్జీలు పెంచుతున్నారు. ఒక్కో సారి గంట ప్రయాణానికి ఐదు వేల రూపాయలకు పైగా వసూలు చేసిన సందర్భాలున్నాయి. కొత్త పాలసీ ప్రకారం ఇక ఈ దోపిడీకి అవకాశం లేదు.
విమానయాన రంగానికి ఊతమిచ్చే మరో నిర్ణయం కూడా కొత్త పాలసీలో భాగం. 20 విమానాలున్న ఎయిర్ లైన్స్ సంస్థ అంతర్జాతీయ సర్వీసులను నిర్వహించ వచ్చు. కచ్చితంగా ఐదేళ్ల పాటు విమానాలను నడిపి ఉండాలనే నిబంధనను సవరించారు. ఎయిర్ ఏసియా, విస్తారా వంటి ఎయిర్ లైన్స్ సంస్థలకు ఇది శుభవార్తే. ఇలాంటి సానుకూల వాతావరణం ఉంటే మరిన్ని విమానయాన సంస్థలు భారత్ కు క్యూకట్టి మరీ వాలిపోయే అవకాశం ఉంది.
దేశంలోని చిన్న నగరాలకు కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెస్తామనేది బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఓ వాగ్దానం. దానికి అనుగుణంగా పాలసీలో నిబంధనలు చేర్చారు. చిన్న నగరాలకు విమానాలను నడపడం వల్ల వచ్చే నష్టాలను కేంద్రం కొంత మేర భర్తీ చేస్తుంది. తద్వారా ఎయిర్ లైన్స్ నిర్భయంగా చిన్న నగరాలకు విమానాలను నడిపే అవకాశం ఉంది. దేశంలో 34 ప్రాంతీయ విమానాశ్రయాలున్నాయి. ప్రస్తుతం అక్కడి నుంచి విమానాలు ఎగరడం లేదు. కొత్త పాలసీ ప్రకారం ఆ నగరాలు, పట్టణాల నుంచి కూడా విమాన సర్వీసులు నడపడం, లాభసాటిగా మార్చడం ప్రభుత్వ ఉద్దేశం.
డొమెస్టిక్, అంటే దేశవాళీ ప్రయాణికుల సంఖ్యను లక్షల నుంచి కోట్లకు పెంచాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. మరో మాటలో చెప్పాలంటే, 2022 నాటికి డొమెస్టిక్ టికెట్ల విక్రయం 30 కోట్లకు చేరాలనేది కొత్త పాలసీ టార్గెట్. ఎప్పుడో 1930లలో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన ఏవియేషన్ పాలసీని ఇంత కాలానికి మోడీ ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్ పౌర విమానయాన రంగంలో మాత్రం ప్రపంచంలో 9వ స్థానంలో ఉంది. 2022 నాటికి ప్రపంచంలో నెంబర్ త్రీ ర్యాంకుకు ఎగబాకేలా చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. మొత్తానికి ఈ కొత్త పాలసీని పరిశ్రమ వర్గాలు వేనోళ్ల పొడుగుతున్నాయి. ఈ ప్రకటన వెలువడగానే స్టాక్ మార్కెట్ లో బుల్ రంకెలు వేసింది.