మహనీయులు కోరిన సమసమాజం.. జగన్‌తో సాధ్యమవుతుందని.. ఏపీ అసెంబ్లీ ప్రస్తుతించింది. ఐదు కీలకమైన బిల్లులను… ఈ రోజు అసెంబ్లీ ఆమోదించింది. పంటల సాగుదారు హక్కుల బిల్లు, విద్యుత్ శాసనాల సవరణ బిల్లు, హిందూ ధార్మిక సంస్థల దేవదాయ సవరణ బిల్లు, పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉపాధి బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లుల్లో చర్చల సందర్భంగా… ఎమ్మెల్యేలను.. జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికీ నిధులు కేటాయించి.. వారి సంక్షేమానికి పాటుపడుతున్నారని సభ్యులు అభినందనలు తెలిపారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్ అని, ఆయనకు రుణపడి ఉంటామన్నారు.
పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని..సీఎం జగన్ మండిపడ్డారు. కొత్తచట్టం మూలంగా పరిశ్రమలు రావని, దాని వల్ల ఉద్యోగాలు కూడా రావని అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజల భవిష్యత్తున్ని దృష్టిలో ఉంచుకునే ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఇక ఉండదన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. పరిశ్రమల్లో ఉద్యోగులకు కావాల్సిన నైపుణ్యాన్ని ఈ సెంటర్ల ద్వారా శిక్షణ ఇస్తామన్నారు.
చట్టం ప్రకారం స్థానికులకు వెంటనే ఉద్యోగాలు కల్పించకపోతే.. మూడేళ్ల కాలపరిమితిలో కల్పించే వెసులుబాటు చట్టంలో కల్పించారు. ఇక నుంచి వైఎస్ జగన్‌కు ముందు… ఆ తర్వాత అని చెప్పుకోవాలని, మహనీయులు కోరిన సమసమాజం వైఎస్ జగన్‌తోనే సాధ్యమవుతుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ప్రస్తుతించారు. రాజకీయాల్లో వైఎస్ జగన్ కొత్త విప్లవాన్ని సృష్టించారని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి చిన్న వయస్సులోనే గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారని … ఈ చట్టం ద్వారా చరిత్రలో నిలిచిపోతారని పలువురు ఎమ్మెల్యేలు అభినందించారు. ఈ బిల్లులపై చర్చలో టీడీపీ సభ్యులు పాల్గొనలేదు. తమ సభ్యుల సస్పెన్షన్ ఎత్తి వేయకపోవడం, చంద్రబాబుకు మాట్లాడే చాన్స్ ఇవ్వకపోవడంతో వారు ఈ రోజు సమావేశాలను బహిష్కరించారు.