టీటీడీకి కొత్త బోర్డు కోసం సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి అందరూ వెయిట్ చేస్తున్నారు. కొత్త చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు అన్న ఆసక్తి రాజకీయ నాయకుల్లోనే కాదు ప్రతి ఒక్కరిలోనూ ఉంది.
కొత్త ప్రభుత్వం రాగానే టీటీడీ చైర్మన్ గా నాగబాబు అన్న పుకార్లు వినిపించాయి. ఆ తర్వాత మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు వినిపించింది. కానీ, అవేవి నిజాలు కావు. కొత్త బోర్డుపై కసరత్తు జరుగుతున్నా… నియామకానికి ఎంత ఒత్తిడి ఉందో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు వింటే అర్థమవుతుంది.
ఒక్క జనసేన పార్టీ నుండే కనీసం 50మంది టీటీడీ బోర్డు మెంబర్లుగా, చైర్మన్ గా అవకాశం కల్పించాలని కోరారట. సహజంగానే టీడీపీ నుండి ఆశావాహులు ఇంకా ఎక్కువే ఉంటారు. బీజేపీకి కూడా ప్రాధాన్యత ఉంటుంది. పైగా సినిమా రంగం నుండి పక్క రాష్ట్రాల నుండి, పారిశ్రామికవేత్తల నుండి ఒత్తిడి అదనం.
అందుకే కొత్త బోర్డు ఏర్పాటు ఆలస్యం అవుతోంది. అయితే, త్వరలోనే దీనికి ముగింపు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త బోర్డు, చైర్మన్, మెంబర్లపై సీఎం చంద్రబాబు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని… గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి ముగింపు పలికేలా, ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త బోర్డు ఉండబోతున్నట్లు అధికార పార్టీ వర్గాలంటున్నాయి.