కొత్త అసెంబ్లీ భవనం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం, అద్భుతం అన్నారు. కొత్త భవనంలో పాత రోత లేకుండా సమావేశాలన్నీ కొత్తగా ఉండాలని సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కోరుకున్నారు. కానీ కథంతా సేం టు సేం. ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ తప్పు చేస్తున్నాడు. గవర్నర్ చేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజెలవ్వరికీ కూడా నమ్మశక్యం కాని అబద్ధాలు చెప్పించాడు చంద్రబాబు. క్షమాపణ చెప్పేదే లేదు, తగ్గేది లేదు, ముఖ్యమంత్రిని మాట్లాడనివ్వం అని చెప్పి ప్రతిపక్ష నాయకులు కూడా రంకెలేశారు. ఆదర్శాలు వల్లె వేసిన స్పీకర్ కానీ, ఎన్నో గొప్ప మాటలు చెప్పిన చంద్రబాబు కానీ, బహిరంగ లేఖ రాసిన జగన్ కానీ చేతల్లో చూపింది మాత్రం ఏమీ లేదు.
ఒక రాష్ట్ర చట్ట సభ, చట్ట సభ్యుల నుంచి ప్రజలు నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉండాలి. మరీ ఆ స్థాయిలో ఎవరికీ అంచనాలు లేవు కానీ చట్టసభ సాక్షిగా అసత్యాలను ప్రచారం చేస్తూ ఉంటే మాత్రం…కోట్లాది మంది ప్రజలకు ప్రతినిధులు అయిన వీళ్ళు…ఆ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు అన్న అనుమానం మాత్రం వస్తుంది. అందరికంటే సీనియర్‌నని చెప్పుకునే చంద్రబాబు నాయుడికే ఈ విషయంలో ఎక్కువ బాధ్యత ఉంటుంది. పిల్లలను ఎలా పెంచాలి అనే విషయం నుంచీ అనేక విషయాలపైన ప్రజలకు క్లాస్ తీసుకుంటూ ఉంటాడు చంద్రబాబు. ఎన్నో నీతి కబుర్లు చెప్తూ ఉంటాడు. అవన్నీ కూడా మాటల వరకే పరిమితమవుతున్నాయి. చేతల్లో కనిపిస్తున్నది ఏమీ లేదు. గవర్నర్ స్పీచ్‌లో అన్ని అసత్యాలు చెప్పించాల్సిన అవసరం ఏమి వచ్చిందో చంద్రబాబే చెప్పాలి. పరిశ్రమలు, ఉద్యోగాల విషయంలో ఎలా చెప్పుకున్నా…వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల గురించి పచ్చి అబద్ధాలు చెప్పారు. మరీ ముఖ్యంగా రాయలసీమ గురించి అయితే ఈ మధ్య వచ్చిన ఈనాడు కథనాలు చదివినా అసలు విషయం అర్థమైపోతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అసత్యాలతో ప్రజలను నమ్మించాలన్న గట్టి పట్టుదలతో ఉన్నట్టుంది. ఇక వైస్సార్ పైన ఉన్న ఫ్యాక్షనిస్ట్ ముద్ర, దూకుడు మనస్తత్వం కలవాడు అన్న ప్రచారమే ఆయన రాజకీయ జీవితానికి చాలా నష్టం చేసింది. ఆ విషయాన్ని వైస్సారే స్వయంగా చెప్పుకున్నాడు. వైఎస్ చెప్పిన ఎన్నో మంచి మాటలను వల్లె వేస్తూ ఉండే జగన్….ఈ విషయం మాత్రం మర్చిపోయినట్టున్నాడు. మొదటిరోజే గొడవ చెయ్యాలన్న ఉబలాటం కనిపించింది. వాకౌట్లు, ధర్నాలతో సభను దద్దరిల్లేలా చేద్దామని ముందుగానే నిర్ణయించుకున్నారో ఏమో తెలియదు మరి. మొత్తంగా కొత్త శాసనసభా భవనంలో కూడా ప్రజా సమస్యలను చర్చించే ఛాన్సే లేదని మాత్రం ప్రజలకు పూర్తి స్పష్టత ఇచ్చారు. చంద్రబాబు-జగన్‌ల ఇగోలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చర్చలు మాత్రం అంతకుమించి అనే స్థాయిలోనే ఉండేలా ఉన్నాయి. శాసనసభలో రచ్చ అనే హెడ్‌లైన్స్ మాత్రం చాలా ఎక్కువగానే కనిపించేలా ఉన్నాయి. కొత్త శాసనసభా భవనం అన్న ఫీలింగ్‌ని… ఒక్క రోజు నడవడికతోనే పూర్తిగా చంపేసిన ఘనత మాత్రం మన చట్ట సభ సభ్యులకు దక్కుతుంది.