ఏప్రిల్ రెండో తేదీన కొత్త మంత్రులమైపోతామని ఆశల పల్లకీలో ఉన్న వారికి వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. అలాంటిదేమీలేదని సంకేతాలు పంపింది. మార్చి 27న ప్రస్తుత మంత్రులంతా రాజీనామాలు చేస్తారని .. రెండో తేదీన కొత్త మంత్రులంటూ కొద్ది రోజుల కిందట వైసీపీ హైకమాండ్ మీడియాకు లీక్ ఇచ్చారు. ఆ ఇరవై ఏడో తేదీ దగ్గర పడగానే.. ఇప్పుడు అలాంటిదేమీ లేదని.. ఏప్రిల్ పదకొండు అంటూ కొత్త తేదీని మరోసారి లీక్ చేసింది.
ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో చేయబోయే మార్పుల గురించి సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్టుగా చెబుతున్నారు. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్.. అప్పుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గం రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంటుందని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి కేబినెట్లో చోటు కల్పిస్తానని అన్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను మార్చి.. తొలి విడతలో అవకాశం దక్కనివారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ చెప్పారు.
అయితే రెండున్నరేళ్లు ముగిసిన తర్వాత కరోనా .. ఇతర కారణాల వల్ల మంత్రివర్గ విస్తరణ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా మంత్రులయ్యేవారు కుదురుకుని ఎన్నికల సమయానికి పట్టు సాధిస్తే.. విజయం సులువు అవుతుందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. పొగడ్తలు.. తిట్లనే ఆయుధాలుగా చేసుకుంటున్నారు.