తెలంగాణ మంత్రివర్గాన్ని నేడో రేపో పునర్వ్యవస్థీకరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో.. ఎమ్మెల్యేల్లో ఆశావాహులు అనేక మంది.. ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రోజు రోజుకు కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ సారి బయటకు వచ్చిన పేరు.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. మొన్నటి ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన… వినోద్‌ను కేబినెట్లోకి తీసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
విస్తరణలో ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కసరత్తు కూడా చేశారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. హరీశ్ రావుపై సిఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయనకు కేబినెట్లో అవకాశం దక్కదని చెబుతున్నారు. ఎప్పుడు విస్తరణ చేపట్టినా హరీశ్ రావు పేరు పరిశీలించే ఉద్దేశం కేసీఆర్‌కు లేదంటున్నారు. హరీష్‌కు ఇవ్వకుండా.. కేటీఆర్‌కు ఇస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరినీ పక్కకు పెట్టి మాజీ ఎంపీ వినోద్ కు అవకాశమివ్వాలని యోచిస్తున్నారట. కేటీఆర్ స్థానంలో వినోద్ కు చోటు కల్పిస్తే కరీంనగర్ కోటా భర్తీ అవుతుందని, మొదటి నుండి పార్టీలో ఉన్న సీనియర్, ఉద్యమనేతకు అవకాశం కల్పించి.. విమర్శలకు చెక్ పెట్టినట్లవుతుందని… అంచనాకు వచ్చారు. హరీశ్ స్థానంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మహిళగా పద్మా దేవెందర్ రెడ్డికి అవకాశమివ్వొచ్చంటున్నారు. కుటుంబ సభ్యులిద్దరినీ అధికారానికి దూరం ఉంచామన్న పేరు కూడా వస్తుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కేబినెట్లో ఆరు ఖాళీలున్నాయి. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కేసీఆర్ తనతో పాటు మహమూద్ అలీ ఒక్కరికే అవకాశం కల్పించారు. ఆ తర్వాత మరో పదకొండు మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. హరీశ్ రావు, కేటీఆర్ లకు అవకాశమివ్వలేదు. 15శాతం నిబంధన ప్రకారం తెలంగాణ మంత్రివర్గంలో మరో ఆరు ఖాళీలున్నాయి. ముఖ్యమైన ఆర్థిక, మున్సిపల్, రెవెన్యూ, పరిశ్రమలు, ఐటీ శాఖలకు మంత్రులు లేరు. ఈ శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటడంతో ఈ శాఖల పనులు ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా ఆలస్యం అయితే అభివృద్ధిపై ప్రభావం పడుతుంది కాబట్టి.. మంత్రివర్గాన్ని విస్తరించడానికి సిద్ధమయ్యారంటున్నారు.