టీడీపీ హయాంలో… విజయవాడలో కాల్‌మనీ కేసు కలకలం రేపింది. దీని ఆధారంగా.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి.. అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా.. చేసిన ఎస్పీల సమీక్షలోనూ.. ఇదే కేసుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా.. కాల్‌మనీ కేసు బయటపడింది. ఈ సారి కాల్‌మనీ వ్యాపారులు.. పులివెందుల వాసులే. బాధితుడు… మాత్రం.. సామాన్యుడు కాదు. మాజీ ఎమ్మెల్యే. అదీ కూడా.. గతంలో వైఎస్ ప్రాపకంతో ఎమ్మెల్యే అయిన నేత.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004-2009 వరకు అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యేకా ఉన్న జొన్నా రామయ్య.. నిన్న తన ప్రాణానికి పులివెందుల వడ్డీ వ్యాపారుల నుంచి ప్రాణహానీ ఉందని.. ఫిర్యాదు చేశారు. చాలా కొద్ది మొత్తం అప్పు ఇచ్చి.. ఇప్పటికీ పులివెందుల వడ్డీ వ్యాపారులు తన వద్ద నుంచి రూ. పది కోట్లు వసూలు చేశారని.. ఇంకా అప్పు అలాగే ఉందని.. వేధిస్తున్నారని… కన్నీటి పర్యంతమయ్యారు. వారి బారినుంచి తనను కాపాడాలని ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డిని, పోలీసులను, మీడియాను వేడుకున్నారు. తన ఆస్తులన్నీ లాగేసుకున్నారని.. తనకు ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదని.. అయినప్పటికీ వేధిస్తున్నారని.. ఆవేదన చెందుతున్నారు.
నిజానికి కదిరిలో చాలా కాలంగా పులివెందుల ప్రాబల్యమే ఉంది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున వడ్డీ వ్యాపారులు కదిరిలో వడ్డీలకు ఇస్తూంటారు. అయితే అవన్నీ.. కాల్ మనీ తరహా వ్యాపారాలే. అధిక వడ్డీలు వసూలు చేస్తారు. ఇవ్వకపోతే.. ఏం చేయడానికైనా వెనుకాడరు. రాజకీయంగానూ.. వారు కదిరిలో పట్టు సాధించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కూడా పులివెందుల ప్రాంతానికి చెందినవారనే ప్రచారం ఉంది. కొద్ది రోజుల క్రితం.. ఈ పులివెందుల కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలకు భరించలేక… ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విజయవాడ కాల్‌మనీ కేసులపై అంతగా స్పందించిన జగన్మోహన్ రెడ్డి.. ఓ మాజీ ఎమ్మెల్యే వ్యక్తం చేస్తున్న ఆవేదనను పట్టించుకుంటారో లేదో..?