టీవీ 9 గ్రూప్ కొత్త సీఈవోగా.. మహేంద్ర మిశ్రాను.. అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ బోర్డు నియమించింది. ప్రస్తుతం మహేంద్ర మిశ్రా.. టీవీ 9 కన్నడ చానల్ సీఈవోగా ఉన్నారు. ఇప్పటి నుంచి మొత్తం టీవీ9 చానళ్లకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. తెలుగు టీవీ9 చానల్‌కు సంబంధించి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా… గొట్టిపాటి సింగారావును నియమించారు. ఇక టీవీ9 వ్యవహారాలను ఆయనే చూసుకుంటారు. ప్రస్తుతం మై హోం గ్రూప్ రామేశ్వరరావు కొద్ది రోజుల క్రితం టేకోవర్ చేసిన..లెఫ్ట్ పార్టీల చానల్ టెన్ టీవీకి..సింగారావు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు టీవీ9 బాధ్యతలు కూడా తీసుకోనున్నారు.
గత ఏడాది.. టీవీ9 ప్రమోటర్ అయిన శ్రీనిరాజు నుంచి 91 శాతం ఏబీసీఎల్ వాటాను… బడా కాంట్రాక్టర్లయిన మేఘా కృష్ణారెడ్డి, మైహోం రామేశ్వరరావు కొనుగోలు చేశారు. అయితే.. ఈ కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగలేదు. అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. దీనంతటికి కారణంగా.. సీఈవోగా ఉన్న రవిప్రకాషేనని…ప్రచారం జరిగింది. అయితే.. అంతర్గతంగా జరిగిన వ్యవహారాలు బయటకు రాలేదు. హఠాత్తుగా… రవిప్రకాష్‌పై.. టీవీ9 నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన.. అలంద మీడియా సంస్థ డైరక్టర్ కేసు పెట్టడం..పోలీసులు ఇన్వాల్వ్ అవడంతో.. మొత్తం సీన్ మారిపోయింది. గురువారం.. టీవీ9 సీఈవో పదవి నుంచి రవిప్రకాష్ ను తొలగించినట్లు అలందా మీడియా చెప్పినా… రవిప్రకాష్ మాత్రం..స్క్రీన్ మీదకు వచ్చి తానే సీఈవోనని చెప్పుకున్నారు. దాంతో డైరక్టర్ల బోర్డు.. హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో సమావేశమై..కొత్త సీఈవోను… టీవీ 9 తెలుగు సీవోవో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
90శాతానికిపైగా వాటా.. టీవీ 9 గ్రూప్‌లో అలంద మీడియాకు ఉన్నప్పటికీ… చానల్ ను మొదటి నుంచి నడుపుతున్న వ్యక్తిగా రవిప్రకాష్‌కు యంత్రాంగంపై మంచి పట్టు ఉంది. అందుకే..తనను సీఈవోగా తొలగించారన్న ప్రకటన వచ్చిన తర్వాత కూడా ఆయన నేరుగా..చానల్‌కు వచ్చి..స్క్రీన్ మీదకువచ్చి… తానే సీఈవోనని ప్రకటన చేశారు. దీని తర్వాత అలంద మీడియా సంస్థ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సెక్యూరిటీ ఏజెన్సీని కూడా రాత్రికి రాత్రి మార్చేశారని చెబుతున్నారు. ప్రస్తుత పరిణామాలు … ఇక టీవీ9 నిర్వహణలో రవిప్రకాష్‌కు సంబంధం ఉండదని తేలిపోయింది. మైనర్ వాటాదారునిగా మాత్రం ఉంటారు.